TTD: తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనానికి భారీ ఏర్పాట్లు : టీటీడీ ఈవో
- Author : Balu J
Date : 19-12-2023 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
TTD: వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతుతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. గతంలో వలెనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తామని చెప్పారు. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబోమని అన్నారు.