Tirumala Devotees : తిరుమలకు వెళ్తున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి !
Tirumala Devotees : తమ ప్రతిభను ప్రదర్శించాలనే ఆశతో మోసపోతున్న కళాకారులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా అనుమతులు పొందినట్లు చెబుతూ కార్యక్రమాల ప్రకటనలు చేస్తే వాటిని నమ్మేముందు ధృవీకరించాలి
- Author : Sudheer
Date : 02-07-2025 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ (HDPP) పేర్లను తప్పుదోవ పట్టిస్తూ, ఓ నకిలీ కార్యక్రమం పేరిట వేలాది మంది కళాకారుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌కు చెందిన సూత్రపు అభిషేక్ (Abhishek) అనే వ్యక్తి తిరుమల ఆస్థాన మండపంలో “శ్రీనివాస కళార్చన” అనే నాట్య కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ప్రచారం చేశాడు. అయితే, ఈ కార్యక్రమానికి అధికారిక అనుమతి లేకుండానే ఆయన తప్పుడు హామీలతో 93 కళాబృందాలకు చెందిన 2,900 మంది కళాకారుల నుంచి సుమారు రూ.35 లక్షలు వసూలు చేశాడు.
కళాకారుల ఫిర్యాదుతో తిరుమల I టౌన్ పోలీసులు స్పందించి అభిషేక్‌ను జూలై 1న అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. Cr. No. 43/2025 u/s 316(2), 318(4) BNS కింద కేసు నమోదు చేసి, తిరుపతి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. తిరుమల డీఎస్పీ విజయశేఖర్ ఆదేశాలతో సీఐ విజయ్ కుమార్, ఎస్సై రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. టీటీడీ, హెచ్‌డిపిపి స్పష్టంగా ప్రకటించిన విధంగా – ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
తమ ప్రతిభను ప్రదర్శించాలనే ఆశతో మోసపోతున్న కళాకారులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా అనుమతులు పొందినట్లు చెబుతూ కార్యక్రమాల ప్రకటనలు చేస్తే వాటిని నమ్మేముందు ధృవీకరించాలి. నకిలీ ప్రకటనలు, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు లేదా టీటీడీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కళను మోసం చేసే ప్రయత్నాలను ఉపేక్షించబోమని, ఇటువంటి మోసగాళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి పోలీసులు స్పష్టం చేశారు.