Waheeda: వహీదా.. తుఝే సలామ్..!
ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై.. ఆజ్ ఫిర్ మర్నేకా ఇరాదా హై..ఈ పాట గుర్తుందా..? గుర్తు లేకుండా ఎలా ఉంటుంది? వహీదా రెహ్మాన్ (Waheeda) గుర్తుంటే ఈ పాట గుర్తుంటుంది.
- By Hashtag U Published Date - 01:14 PM, Wed - 27 September 23

By: డా. ప్రసాదమూర్తి
Waheeda: ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై.. ఆజ్ ఫిర్ మర్నేకా ఇరాదా హై..ఈ పాట గుర్తుందా..? గుర్తు లేకుండా ఎలా ఉంటుంది? వహీదా రెహ్మాన్ (Waheeda) గుర్తుంటే ఈ పాట గుర్తుంటుంది. ఈ పాట గుర్తుంటే అరవయ్యో దశకంలో కుర్రకారు గుండెల్లో గులాబీ పరిమళాల తుఫాను రేపిన శకం ఒకటి స్మరణకు వస్తుంది. అది మామూలు దశాబ్ది కాదు. ఆ దశాబ్దికి ఒక పేరు పెడితే వహీదా దశాబ్ది అనాలి. వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వార్త వినగానే అనేకానేక ఊహలు మనసును ముట్టడించాయి.
ఎక్కడో తమిళనాడులో పుట్టి, హైదరాబాదులో పెరిగిన ఒక ముస్లిం అమ్మాయి, రోజులు మారాయి అనే తెలుగు సినిమాతో 1955లో తెరంగేట్రం చేసి, ఎక్కడో హిందీ సినిమా ప్రపంచాన్ని ఆకర్షించిన కాలంలోకి మనం వెళ్తే, తప్పనిసరిగా మన గుండెల్లో నుంచి గురుదత్ బయటకు వస్తాడు. రోజులు మారాయి సినిమాలో వహీదా రెహ్మాన్ ని చూసి హైదరాబాద్ హుటాహుటిన ప్రయాణమై గురుదత్ వచ్చాడట. నాకు నువ్వే కావాలని బతిమాలి బామాలి బొంబాయి తీసుకుపోయాడట. ఎన్నో పట్టింపులు ఏవేవో షరతులు, ఎంతో బిడియం, మరింత తటపటాయింపు, అన్నింటినీ తన అందం చుట్టూ కప్పుకొని వహీదా బొంబాయి వెళ్ళింది.
1957లో గురుదత్ ‘ప్యాసా’ సినీ దునియాలో భూకంపం పుట్టించింది. ఒక్కసారి గా వహీదా వెండితెర ప్రపంచమంతా వేల నక్షత్రాల వెలుగులు కురిపించింది. ఇక అక్కడ మొదలైంది వహీదా శకం. అది కాలానికి పూనకంలా పట్టింది. కేవలం సినీ ప్రేమికులనే కాదు, గురుదత్ జీవితాన్ని కూడా వహీదా రెహ్మాన్ కోటి ఇంద్రధనస్సుల ఆకాశమై కమ్ముకుపోయిన కాలమది. ప్యాసా మత్తు నుంచి సినీ జగత్తు ఇంకా కోలుకోక ముందే, 1959లో ‘కాగజ్ కా ఫూల్’ సినిమా తీసి గురుదత్ మరోసారి వహీదా నటనానుభావాన్ని, సౌందర్యానుభవాన్ని ఏకకాలంలో లోకానికి పరిచయం చేశాడు.
Also Read: Viral Pics: నయన్-విఘ్నేశ్ కవల పిల్లలను చూశారా.. భలే క్యూట్ గా ఉన్నారే!
అందులో ఒక పాట ఉంటుంది. వక్త్ నే కియా క్యా హసీ సితం.. తుమ్ రహే న తుమ్.. హమ్ రహే న హమ్.. అంటే ‘కాలం ఎంత అందమైన తప్పు చేసిందో చూశావా, నువ్వు నువ్వుగా లేవు, నేను నేనుగా లేను’ . ఈ పాట వహీదా గురుదత్ ల హీరో హీరోయిన్ పాత్రలకే కాదు, వారి వ్యక్తిగత జీవితాలకు అన్వయిస్తుంది అని అంతా చెప్పుకుంటారు. అదేమో గాని వారిద్దరినీ ఆ సినిమాలో చూసి, ఆ పాట పాడుకున్న వారు కూడా అవును నేను నేను కాదు, నువ్వు నువ్వు కాదు అని అనుకోవాల్సిందే. అలాంటి మాయ చేసింది వహీదా.
అంతే. ఇక కాలం వహీదా వెంట పరిగెత్తింది. నీల్ కమల్, గైడ్, తీశ్రీ కసమ్, చౌదవీ కా చాంద్, సాహిబ్ బీబీ ఔర్ గులాం, ఖామోషి, బీస్ సాల్ బాద్, ఆద్మీ.. ఇలా ఒకటి తర్వాత ఒకటి వెండితెర ప్రపంచమంతా కొత్త నక్షత్రాల కుంభవృష్టి కురిసింది. ‘ చౌదవీ క చాంద్ హో.. యా ఆఫ్తాబ్ హో.. జో భీ హో తుమ్ ఖుదా కి కసమ్, లా జవాబు హో ‘ అంటూ వహీదా అనబడే అత్యద్భుత సౌందర్యం ముందు సినీ ప్రేమిక ప్రపంచం తలవంచి సలాం చేసింది. నటించింది వందలోపు సినిమాలే. వాటిలో మరపురాని హీరోయిన్ గా కాలాన్ని మురిపించిన సినిమాలు పాతిక లోపే. అయితేనేం, ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటి అవార్డులు చాలా వచ్చాయి. 1972లో పద్మశ్రీ, 2011 పద్మభూషణ్ ఇట్లా ఐదు దశాబ్దాల వహీదా వెండితెర పండగ లాంటి ప్రయాణానికి ఎన్నో పురస్కారాలు ఎదురొచ్చి ఆమెను చుట్టుకున్నాయి.
ఇప్పుడు దాదాసాహెబ్ పురస్కారం వహీదా రెహ్మాన్ నటకిరీటంలో కొత్తగా చేరిన అద్భుత మణిరత్నం. సినిమా ప్రపంచం అంటేనే ఒక అందమైన కలల దునియా. అందులో ప్రవేశించాక వారి జీవితాలు చుట్టూ, వారి కథల చుట్టూ అనేక కథలు అల్లుకుంటూనే ఉంటాయి. ఏది సత్యం ఏదసత్యం మనం చెప్పలేం. కానీ గురుదత్ తన చేతుల మీదుగా సృష్టించిన వహీదా తన చుట్టూ గురుదత్ చుట్టూ కూడా ఒక కథ సృష్టించింది. ఆ కథతో కాలానికి పనిలేదు. తనకు కాలాన్ని గులాం చేసుకున్న వహీదా సౌందర్యాభినయ అనుభవమే పది కాలాలు నిలిచిపోతుంది. అందుకే ఈ సందర్భంగా వహీదా తుఝే సలాం అంటున్నాను.