Tollywood Singer: తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ రేవంత్..!
టాలీవుడ్ సింగర్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
- By Maheswara Rao Nadella Published Date - 11:20 AM, Fri - 2 December 22

టాలీవుడ్ సింగర్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్నాడు. తనదైన శైలిలో బిగ్ బాస్ రియాల్టీ షోలో రాణిస్తున్నాడు. బిగ్ బాస్ లోకి వచ్చే నాటికే అన్విత నిండు గర్భిణి. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమె సీమంతం జరిగింది. సీమంతం వీడియోను చూసి రేవంత్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఎమోషన్ తో కంటతడి పెట్టుకున్నాడు.
చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని… తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని… అందుకే ‘నాన్నా’ అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. నాన్నా అని పిలిచేందుకు చిన్నారి ఆ ఇంట అడుగుపెట్టింది. తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.