Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ రాజపుత్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్టు బిగ్ షాక్.
- By Kode Mohan Sai Published Date - 12:21 PM, Sat - 26 October 24

రియా చక్రవర్తికి సుప్రీం కోర్టు ఉపశమనం:
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఉపశమనం లభించింది. సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులను బాంబే హైకోర్టు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.
ఈ సందర్భంగా, సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు ఉన్నత కుటుంబానికి చెందినవారని, అందుకే బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేశారని వారు ఆరోపించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ మరియు జస్టిస్ కే విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను పనికిమాలినదిగా అభివర్ణించారు.
జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు:
“మేము హెచ్చరిస్తున్నాం.. నిందితుల్లో ఒకరు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇటువంటి పనికిమాలిన పిటిషన్ వేయడం గందరగోళంగా ఉంది. దీనిని మేము తిరస్కరిస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు సమాజంలో ఉన్నతమైన మూలాలను కలిగి ఉన్నారు. మూడున్నరేళ్లుగా ఈ కేసు పురోగతికి సహకరిస్తున్న రియాపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం సమంజసం కాదు. నోటీసు ఇవ్వడం హేతుబద్ధత లేకుండా ఉందని” జస్టిస్ గవాయ్ మండిపడ్డారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో జూన్ 2020లో శవంగా కనపడిన సంగతి తెలిసిందే. దీనిని హత్యా లేదా ఆత్మహత్యగా తెలియాలనే ఉద్దేశ్యంతో అనుమానాస్పద మరణం కింద కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. సుశాంత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుకాగా, తరువాత అది సీబీఐకి బదిలీ చేయబడింది.
రియా చక్రవర్తికి అనుకూల తీర్పు:
ఈ కేసులో, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఆమె తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజీత్ చక్రవర్తి మరియు తల్లి సంధ్య చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. అయితే, వీటిని బాంబే హైకోర్టులో సవాల్ చేస్తే, న్యాయస్థానంలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
కోర్టు, నోటీసుల జారీకి ఎటువంటి స్పష్టమైన కారణాలు లేవని కొట్టివేసింది. అంతేకాకుండా, నటి మరియు ఆమె కుటుంబానికి సమాజంలో గుర్తింపు ఉందని, దర్యాప్తు సంస్థలకు సహకరించారని కోర్టు స్పష్టం చేసింది.
రియా చక్రవర్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ:
ఆ సంవత్సరం, రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి విచారణకు గురయ్యారు. సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేయించుకుని, ఆత్మహత్యకు కారణమయ్యారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, ఈడీ రియాకి సంబంధించిన ఆదాయ మార్గాలు, పెట్టుబడులు, మరియు ఒప్పందాలపై దృష్టిపెట్టింది. చనిపోయే సమయానికి, రియా మరియు సుశాంత్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిసింది.