Cabinet Subcommittee : సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు.
- By Latha Suma Published Date - 03:33 PM, Thu - 26 December 24

Cabinet Subcommittee : సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.
సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సినీ పెద్దలు ప్రస్తావించిన నేపథ్యంలో వీటి అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు. ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలు, ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలను కూలంకషంగా పరిశీలించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి పలు సిఫార్సులు అందజేయనుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది.
సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు. అది రీచ్ అవాలని చూస్తున్నాం.. సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదు అని దిల్ రాజు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం అని తెలిపారు.
Read Also: IRCTC Website: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్… ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు