VN Aditya : అమెరికాలో కొత్త సినిమా తీస్తున్న తెలుగు దర్శకుడు.. ఆడిషన్స్ కూడా అక్కడే..
ఈ సారి VN ఆదిత్య అమెరికాలో సినిమా తెరకెక్కించబోతున్నారు.
- By News Desk Published Date - 09:04 AM, Tue - 9 July 24

VN Aditya : వీఎన్ ఆదిత్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను, ఆట.. లాంటి మంచి హిట్ సినిమాలు అందించారు. ఆదిత్య ఇటీవల కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అవి ప్రస్తుతం రిలీజ్ కి రెడీలో ఉన్నాయి. అవి రిలీజ్ కి రెడీగా ఉండగానే VN ఆదిత్య మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు.
ఈ సారి VN ఆదిత్య అమెరికాలో సినిమా తెరకెక్కించబోతున్నారు. అందరూ కొత్త నటీనటుల్ని కూడా అక్కడినుంచే తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోనే మూవీ ప్రెస్ మీట్ పెట్టారు. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా VN ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో ఈ కొత్త సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం డల్లాస్‌లోనే జరగనుందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ VN ఆదిత్య అమెరికాలోనే ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కి ప్రవాస భారతీయులు మాత్రమే కాక అమెరికన్స్, స్పానిష్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్.. ఇలా అన్ని దేశాలకు చెందిన వాళ్ళు నటనలో ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్ కి వచ్చారు. అమెరికాలో ఆడిషన్స్ పెడితే ఇంతమంది వివిధ దేశాల నుంచి పాల్గొనడంపై డైరెక్టర్ VN ఆదిత్య సంతోషం వ్యక్తం చేసారు. లవ్ స్టోరీలతో మెప్పించే VN ఆదిత్య ఈసారి అమెరికాలో కొత్తవాళ్లతో ఎలాంటి సినిమా తీసుకొస్తారో చూడాలి.