Peddada Murthy: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత మృతి
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణాలు టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
- By Anshu Published Date - 09:20 PM, Tue - 3 January 23

Peddada Murthy: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణాలు టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపాయి. వరుస మరణాలు టాలీవుడ్ ను దిగ్బ్రాంతికి గురి చేశాయి. అభిమానులు, వారి కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి. ఒకే ఏడాదిలో నలుగురు ప్రముఖ నటులను టాలీవుడ్ కోల్పోయింది.
ఈ క్రమంలో న్యూ ఇయర్ ప్రారంభంలోనే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి మంగళవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. తాజాగా కన్నుమూశారు. పెద్దాడ మూర్తి మృతి పట్ల టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణానికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
పెద్దాడ మూర్తి స్వస్థలం విశాఖపట్నంలోని భీమునిపట్నం. జర్నలిస్ట్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. అనేక పత్రికల్లో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కూతురు అనే సినిమాతో ఆయన పాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇడియట్, మధుమాసం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, స్టాలిన్, కౌసల్య సుప్రజల రామ అనే సినిమాలో ఆయన అనేక పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
చందమామ సినిమాలోని బుగ్గే బంగారమా, స్టాలిన్ సినిమాలో సిగ్గుతో ఛీ ఛీ అనే పాటు బాగా హిట్ అయ్యాయి. ఇటీవల చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది, ఆ విషాదాలు మరువకముందే ఇప్పుడు పెద్దాడ మూర్తి మరణం టాలీవుడ్ ను దిగ్బాంతికి గురి చేసింది. ప్రముఖ పాటల రచయితను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు అని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.