Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:23 AM, Fri - 21 November 25
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో మహాలక్ష్మి గా నటించిన భాగ్యశ్రీ బోర్సే, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేసింది. పల్లెటూరి అమ్మాయి పాత్ర కథలో కీలకమని, ప్రేక్షకులు ఈ పాత్రను తప్పకుండా గుర్తుంచుకుంటారన్నారు. రెండు సినిమాలతోనే వచ్చిన అభిమానాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో అరుంధతి తరహా పాత్రలు చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. రామ్–భాగ్యశ్రీ జంట ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆమె తెలిపింది.
రామ్ పోతినేని హీరోగా వస్తున్న చిత్రం ‘ ఆంధ్రా కింగ్ తాలూకా ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్, ట్రైలర్‌తోనే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రామ్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రగా కనిపించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్‌తో ప్రేక్షకుల్లో పెద్ద ఇంపాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన భాగ్యశ్రీ, తన పాత్ర విశేషాలు, షూటింగ్ అనుభవాలు, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వమైన స్పందన గురించి వివరించారు. ‘‘ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ప్రాధాన్యత ఉన్న రోల్‌లో నటిస్తున్నారు. ప్రేక్షకులు నాలో ఉన్న నటిగా సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సాహం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో ఆమె మహాలక్ష్మి అనే పాత్రలో కనిపించబోతున్నా. పల్లెటూరి నేపథ్యంతో, హృదయానికి హత్తుకునే ప్రేమకథలో మహాలక్ష్మి పాత్ర చాలా ముఖ్యమైంది. మీరు సినిమా చూస్తే ఈ క్యారెక్టర్ ఎంత అందంగా రాయబడిందో, దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం అవుతుంది. ఆడియన్స్ ఈ పాత్రను తప్పకుండా గుర్తుంచుకుంటారు’’ అని భాగ్యశ్రీ చెప్పింది.
తెలుగులో రెండు సినిమాలతోనే విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె ఈ లవ్ స్టోరీలో ప్రేక్షకులు తనను ఇంకా ఎక్కువగా అభిమానిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘అభిమానం అనేది ఒక గొప్ప భావోద్వేగం. ఎలాంటి పరిచయం లేకపోయినా ఒక నటిని ఈ స్థాయిలో ప్రేమించడం, గౌరవించడం ఎంతో గొప్ప విషయం. రెండు సినిమాలతోనే నన్ను తెలుగమ్మాయిగా భావించి ఇంత ప్రేమ చూపించడమంటే నిజంగా గొప్ప విషయమే. నేను ఈ ప్రేమకు తగిన ప్రతిస్పందన ఇచ్చేలా మంచి పాత్రలు చేస్తూ విలక్షణ నటిగా నిరూపించుకోవాలని ఉంది’’ అని తెలిపింది. భవిష్యత్తులో అనుష్క చేసిన ‘అరుంధతి’లాంటి పవర్‌ఫుల్ రోల్స్ చేయాలన్న కోరిక ఉంది’ అని తన మనసులో మాట బయటపెట్టింది.
ఆంధ్రా కింగ్ తాలూకా కథలో ప్రేమ, భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, సంగీతం అన్నీ అద్బుతంగా ఉంటాయని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. కాలేజీ అమ్మాయిగా నటించిన తన పాత్ర, రామ్ పోషించిన సాగర్‌తో ప్రేమలో పడే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసింది. ఈ ప్రేమకథలోని స్వచ్ఛతే తనకు చాలా బాగా నచ్చిందని తెలిపింది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ జంట స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా మెప్పిస్తుందో చూడాలి.