Satya Nadella : 85 శాతం మంది ఉద్యోగులు అతిగా పని చేస్తున్నారట: సత్య నాదెళ్ల
ఇటీవలే లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్‌కు సత్య నాదెళ్ల (Satya Nadella) ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
- By Pasha Published Date - 01:38 PM, Tue - 17 September 24

Satya Nadella : మైక్రోసాఫ్ట్.. ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీ. అపర కుబేరుడు బిల్‌గేట్స్ దీని ఓనర్. ఈ కంపెనీ సీఈఓగా భారతీయుడు సత్య నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వ పటిమ వల్ల మైక్రోసాఫ్ట్ టెక్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. తమ కంపెనీ ఉద్యోగుల పనితీరుపై తాజాగా సత్య కీలక వివరాలను వెల్లడించారు. లింక్డిన్ కంపెనీ కూడా బిల్‌గేట్స్‌దే. ఇటీవలే లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్‌కు సత్య నాదెళ్ల (Satya Nadella) ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన ఏం చెప్పారంటే..
Also Read :US Vs Russia : అమెరికా సముద్ర జలాల్లోకి రష్యా జలాంతర్గాములు.. ఏమైందంటే ?
‘‘మా కంపెనీ మేనేజర్లు, ఉద్యోగుల పనితీరుపై ఇటీవలే నాకు ఒక నివేదిక అందింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. కరోనా మహమ్మారి తర్వాత కంపెనీలో ఉద్యోగుల పనితీరు చాలా వరకు మారిపోయింది. చేసే పని విషయంలో ఉద్యోగుల ఆలోచనా ధోరణి కూడా మారింది. 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని మేనేజర్లు మాకు రిపోర్టులు ఇచ్చారు. అయితే దీనిపై ఉద్యోగులను మేం ఆరాతీస్తే.. 85శాతం మంది ఉద్యోగులు తాము అవసరమైన దాని కంటే ఎక్కువే కష్టపడ్డామని చెప్పారు. ఈ రెండు కోణాల నుంచి విషయాన్ని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. దీన్ని ఎలా పరిగణించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైన నిర్ణయాలను తీసుకుంటాం’’ అని సత్యనాదెళ్ల వివరించారు.
వచ్చే 25 ఏళ్లలో ఈ ప్రపంచాన్ని భారీ యుద్ధం లేదా కరోనా లాంటి మహమ్మారి చుట్టుముట్టే ముప్పు ఉందని మైక్రోసాఫ్ట్ యజమాని బిల్‌గేట్స్ ఇటీవలే జోస్యం చెప్పారు. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాతావరణ విపత్తులు, సైబర్ దాడుల వల్ల ప్రస్తుతం ప్రపంచానికి రిస్క్ ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్నిదేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు విస్తరించి మహాయుద్ధంగా మారే ముప్పు ఉందని హెచ్చరించారు.