Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య ఇంకా శాంతి కోసం ఎలాంటి పురోగతి లేదు. దీంతో దీర్ఘకాలం పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగవచ్చని తెలుస్తోంది. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ తెలిపింది. అలా జరిగితే మాత్రం త్వరలోనే పెంపు ఉంటుందని పేర్కొంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
సామాన్యులకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి త్వరలోనే పెరిగే సూచనలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) హెచ్చరించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరిన క్రమంలో భారత్ తన ఇంధన ధరల విధానాన్ని మార్చుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. ప్రధానంగా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ సరఫరాను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇదివరకే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారన్న వాదనలు వినిపించాయి. అయితే, వాటిని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇప్పుడు ఏకంగా ఒక అంతర్జాతీయ సంస్థ తప్పదని చెప్పడం గమనార్హం.
త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉంటుందనే వాదనలను కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు కొద్ది రోజుల క్రితం పీటీఐ నివేదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమెర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలు, 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు, జెట్ ఫ్యూయల్ ధరలను పెంచాయి. దీంతో ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లపైన ఉన్నప్పటికీ ప్రభుత్వం గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచలేదు. కానీ కమెర్షియల్ సిలిండర్ ధరను మాత్రం ఏకంగా రూ. 993 పెంచి ఊహించని షాక్ ఇచ్చింది.
ఐఎంఎఫ్ ఏం చెప్పింది?
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచుతారన్న అంచనాల మధ్య అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) సైతం బాంబు పేల్చింది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలను వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రానికి సూచించింది. హార్ముజ్ జల సంధి మూసివేత కారణంగా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్‌కు వెసులుబాటు ఉందని వాదిస్తూనే ముడి చమురు ధరల భారాన్ని బదిలీ చేయాలని సూచించడం గమనార్హం.
ఆయిల్‌పై ఎక్సైజ్ ట్యాక్సులను ప్రభుత్వం తగ్గించింది. కొంత ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చారు. అయితే, ఇది కొద్ది రోజులు మాత్రమే పని చేస్తుంది, కానీ ఎక్కువ కాలం సాధ్యం కాదు. ఇంధన ధరలను ప్రభుత్వం నియంత్రించడం లేదా సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఆర్థిక వనరులపై ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు చమురు ధరలను మరింత పైకి నెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ధరల సవరణకు సిద్ధంగా ఉండాలి అని ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ రీజియన్ డైరెక్టర్ క్రిష్ణ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎన్‌సీఏఈఆర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అయితే, ఐఎంఎఫ్ విశ్లేషణతో ప్రభుత్వం ఏకీభవించడం లేదు. భారతదేశానికి పరిమితమైన ఆర్థిక వెసులుబాటు ఉందని శ్రీనివాసన్ చేసిన సూచనను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా ఖండించారు. దేశం చాలా మెరుగైన స్థితిలో ఉందని ఆమె వాదించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఆమె గణాంకాలను ఉటంకిస్తూ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, పశ్చిమాసియా దేశాలు, వర్ధమాన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ స్థాయి దేశాలతో పోల్చినప్పుడు, జీడీపీలో భారతదేశ స్థూల రుణాల నిష్పత్తి 2026 నాటికి 83.4 శాతం నుంచి 2031 నాటికి 77.7 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.