Neville Tata : టాటా ‘స్టార్ బజార్’ పగ్గాలు నెవిల్లే టాటాకు.. ఎవరాయన ?
టాటా గ్రూప్ ఉత్పత్తులలోని క్వాలిటీని, ఫినిషింగ్‌ను బట్టి ఆ సంస్థ కార్యకలాపాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.
- Author : Pasha
Date : 21-08-2024 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
Neville Tata : టాటా గ్రూప్ అంటే నమ్మకానికి మారుపేరు. ఆ గ్రూప్‌కు ఎవరు సారథ్యం వహించినా కస్టమర్ల వద్ద తమ పేరును నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. టాటా గ్రూప్ ఉత్పత్తులలోని క్వాలిటీని, ఫినిషింగ్‌ను బట్టి ఆ సంస్థ కార్యకలాపాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూపును రతన్ టాటా చాలా విస్తరించారు. ఎన్నో రంగాలలోకి టాటా గ్రూపు అడుగుపెట్టేలా చేశారు. ఇప్పుడు టాటా గ్రూపులోకి కొత్త రక్తం రంగ ప్రవేశం చేస్తోంది. ఈక్రమంలో నెవిల్లే టాటా(Neville Tata) పేరు తెరపైకి వచ్చింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
టాటా గ్రూప్‌కు మన దేశంలోని పలు నగరాల్లో స్టార్ బజార్ పేరుతో స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు దీని బాధ్యతలను 32 ఏళ్ల నెవిల్లే టాటా చేపట్టనున్నారు. టాటా గ్రూప్, బ్రిటీష్ రిటైలర్ టెస్కో కలిసి ట్రెంట్ అనే కంపెనీని ఏర్పాటు చేశాయి. దీని ఆధ్వర్యంలోనే స్టార్ బజార్, వెస్ట్ సైడ్, జుడియో, జారా స్టోర్లు నడుస్తున్నాయి. వీటిలోని స్టార్ బజార్ బాధ్యతలను నెవిల్లే టాటా చేపట్టారు. ప్రస్తుతం ట్రెంట్ కంపెనీ ఛైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా ఉన్నారు. నోయల్ టాటా కుమారుడే నెవిల్లే టాటా. ఇప్పటికే ట్రెంట్ కంపెనీ బోర్డు సభ్యుడిగా నెవిల్లే టాటా ఉన్నారు. ఇప్పుడు స్టార్ బజార్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టినందున.. కంపెనీ బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి నెవిల్లే వైదొలిగారు.
Also Read :Note For Vote: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
- నెవిల్లే టాటా లండన్‌లోని బేయెస్ బిజినెస్ స్కూల్‌లో చదివారు.
- 2016 నుంచి నెవిల్లే టాటా ట్రెంట్ కంపెనీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
- తొలుత ఆయన ట్రెంట్ కంపెనీకి చెందిన ఫుడ్, బేవరేజెస్ వ్యాపారం చూసేవారు. జుడియో కంపెనీకి చెందిన దుస్తుల వ్యాపారాన్ని కూడా నెవిల్లే పర్యవేక్షించేవారు.
- కొంతకాలం పాటు తండ్రి నోయల్ టాటా మార్గదర్శకత్వంలో స్టార్ బజార్ కార్యకలాపాలను నెవిల్లే టాటా పర్యవేక్షిస్తారు. అనంతరం ఆయన ట్రెంట్ కంపెనీ సీఈఓ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
- నోయల్ టాటా కుమార్తెలు కూడా టాటా గ్రూప్ సంస్థల్లో యాక్టివ్‌గా ఉన్నారు.
- టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ విభాగానికి లేహ్ టాటా (39) పర్యవేక్షిస్తున్నారు.
- టాటా డిజిటల్ బాధ్యతలు మాయా టాటా చూస్తున్నారు.