Zika Vaccine : జికా వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్
మనదేశంలోని ఐసీఎంఆర్‌కు చెందిన నెట్‌వర్క్ సైట్లలో జికా వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ పరీక్షలను ఐఐఎల్(Zika Vaccine) నిర్వహించనుంది.
- Author : Pasha
Date : 14-09-2024 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
Zika Vaccine : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రభుత్వరంగ కంపెనీ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ఓ కీలకమైన ప్రాజెక్టును మొదలుపెట్టనుంది. ప్రపంచంలోని చాలా దేశాలను దడపుట్టిస్తున్న జికా వైరస్‌కు విరుగుడును తయారు చేయబోతోంది. జికా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రయోగ పరీక్షలను నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)తో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జికా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన తొలిదశ ప్రయోగ పరీక్షలను నిర్వహించేందుకుగానూ ఐఐఎల్‌కు ఐసీఎంఆర్ నిధులను సమకూర్చనుంది. మనదేశంలోని ఐసీఎంఆర్‌కు చెందిన నెట్‌వర్క్ సైట్లలో జికా వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ పరీక్షలను ఐఐఎల్(Zika Vaccine) నిర్వహించనుంది.
Also Read :Legality To Hydra : ‘హైడ్రా’కు చట్టబద్ధత.. వచ్చే నెలలోనే ఆర్డినెన్స్ : రంగనాథ్
ఈవివరాలను ఐఐఎల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్ వెల్లడించారు. జికా వ్యాక్సిన్ తయారీ కోసం ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సురక్షితమైన, చౌకైన జికా వ్యాక్సిన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. జికా వ్యాక్సిన్‌కు సంబంధించిన తొలిదశ ప్రయోగ పరీక్షలు ముంబైలోని ఏసీటీఆర్ఈసీ, కేఈఎం హాస్పిటల్ ముంబై, ఎస్ఆర్ఎం చెన్నై, పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌లలో జరుగుతాయన్నారు.
Also Read :Taj Mahal : తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
ఏడిస్ దోమల వల్ల జికా వైరస్ వ్యాపిస్తుంది. లైంగిక సంపర్కం, గర్భంతో ఉన్న తల్లి నుంచి కడుపులోని బిడ్డకు, రక్తం ద్వారా, అవయవ మార్పిడి ద్వారా కూడా జికా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ జికా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది జులై 22 నాటికి మనదేశంలో 537 జికా కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతానికి జికా ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేదు.