GCCI : ఐటీఆర్ గడువు పొడిగింపుపై జీసీసీఐ డిమాండ్..!
GCCI : 2025-26 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR), ట్యాక్స్ ఆడిట్ నివేదికల దాఖలు గడువును పొడిగించాలన్న డిమాండ్ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
- By Kavya Krishna Published Date - 05:07 PM, Sat - 16 August 25

GCCI : 2025-26 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR), ట్యాక్స్ ఆడిట్ నివేదికల దాఖలు గడువును పొడిగించాలన్న డిమాండ్ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (GCCI) కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)కి వినతిపత్రం సమర్పించింది.
జీసీసీఐ ప్రకారం, ఐటీఆర్ యుటిలిటీల (ఫారాలు) విడుదలలో ఈ ఏడాది అసాధారణ జాప్యం చోటుచేసుకోవడంతో పాటు, ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత గడువులలోగా రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులకు కష్టసాధ్యమని పేర్కొంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లోనే అన్ని రకాల ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈసారి వాటి విడుదలలో సగటున మూడు నెలల వరకు ఆలస్యం జరిగిందని జీసీసీఐ స్పష్టం చేసింది. ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-4 వరకు ఫారాలు జూలై 30న మాత్రమే విడుదలయ్యాయి. ట్యాక్స్ ఆడిట్ ఫారాలు అయిన 3సీఏ–3సీడీ, 3సీబీ–3సీడీలు జూలై 29న అందుబాటులోకి వచ్చాయి. అత్యధికంగా సంస్థలు, ఎల్ఎల్‌పీలు, ట్రస్టులు వినియోగించే ఐటీఆర్-5 ఆగస్టు 8న మాత్రమే విడుదలైంది.
ఇక ఆడిట్ పరిధిలోకి రాని కేసుల రిటర్నుల గడువు సెప్టెంబర్ 15గా ఉండటంతో, సిద్ధం చేసి దాఖలు చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని జీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఐటీఆర్-6, ఐటీఆర్-7 ఫారాలు ఇంకా అందుబాటులోకి రాలేదని నొక్కి చెప్పింది. ఫారాల విడుదల ఆలస్యానికి తోడు, ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు పన్ను దాఖలు ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని జీసీసీఐ అభిప్రాయపడింది.
యుటిలిటీలలో మార్పులు రావడం వల్ల సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ సిస్టమ్‌లను అప్‌డేట్ చేయడానికి సమయం తీసుకుంటున్నాయి. దీని వలన రిటర్నులు సిద్ధం చేయడంలో కూడా ఆలస్యం అవుతోందని ఛాంబర్ తెలిపింది. ఈ అన్ని కారణాల దృష్ట్యా, పన్ను చెల్లింపుదారులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు ఊరట కల్పించడానికి ప్రస్తుత సెప్టెంబర్ 30గా ఉన్న ట్యాక్స్ ఆడిట్ గడువుతో పాటు, ఐటీఆర్ ఫైలింగ్ గడువును కూడా పొడిగించాలని సీబీడీటీని జీసీసీఐ కోరింది.