కొల్లాపూర్‌లో విద్యకు కొత్త ఊపిరి: డియాజియో ఇండియా ఆధ్వర్యంలో ఆధునిక మోడల్ పబ్లిక్ లైబ్రరీ
నూతన సదుపాయాలతో మెరుగుపడిన ఈ గ్రంథాలయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు అధికారికంగా ప్రారంభించారు.
- Author : Latha Suma
Date : 24-01-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
గ్రంథాలయ ఆధునికీకరణతో విద్యార్థులకు కొత్త అవకాశాలు
మంత్రి జూపల్లి కృష్ణారావు..గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
కమ్యూనిటీ అభివృద్ధిపై డియాజియో ఇండియా దృష్టి
Diageo India తెలంగాణ రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాల బలోపేతానికి డియాజియో ఇండియా మరో కీలక అడుగు వేసింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని మోడల్ పబ్లిక్ లైబ్రరీని సమగ్రంగా ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నూతన సదుపాయాలతో మెరుగుపడిన ఈ గ్రంథాలయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు అధికారికంగా ప్రారంభించారు. విద్య, జ్ఞానం, కమ్యూనిటీ అభివృద్ధి పట్ల డియాజియో ఇండియా చూపుతున్న దీర్ఘకాలిక నిబద్ధతకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
కొల్లాపూర్ మోడల్ పబ్లిక్ లైబ్రరీలో చేపట్టిన ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం విద్యార్థులు, యువత, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేయబడింది. విశాలమైన రీడింగ్ ఏరియాలు, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, విస్తృతమైన పుస్తకాల సేకరణ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా, డిజిటల్ యాక్సెస్ సదుపాయాలతో ఈ లైబ్రరీని ఆధునిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ అప్‌గ్రేడ్‌ల ద్వారా సుమారు 500 మంది యువత ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు సరైన వాతావరణం కల్పించడం ద్వారా విద్యా ఫలితాలు మెరుగుపడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను డియాజియో ఇండియా తమ భాగస్వామి సంస్థ ‘తర్క్ ఫౌండేషన్’ సహకారంతో విజయవంతంగా అమలు చేసింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ..గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. వార్తాపత్రికలు చదవడం మన దినచర్యలో భాగం కావాలి. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వలు కాదు, అవి విజ్ఞాన కేంద్రాలు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువత ఇక్కడ లభించే పుస్తకాలు, మ్యాగజైన్లు, డిజిటల్ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి అని అన్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఇంతటి ప్రమాణాలతో కూడిన గ్రంథాలయం లేదని పేర్కొంటూ కొల్లాపూర్ లైబ్రరీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, యువత ఈ డిజిటల్ లైబ్రరీని చురుగ్గా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డియాజియో ఇండియా కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ శ్రీ దేవాశిష్ దాస్‌గుప్తా మాట్లాడుతూ..బలమైన కమ్యూనిటీలతోనే అర్థవంతమైన ప్రగతి సాధ్యమవుతుందని మేము విశ్వసిస్తున్నాం. విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మేము పనిచేసే ప్రాంతాలకు దీర్ఘకాలిక విలువను సృష్టించడమే మా లక్ష్యం అని తెలిపారు. బాధ్యతాయుతంగా ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో వ్యాపారం చేయడమే డియాజియో ఇండియా విధానమని ఆయన స్పష్టం చేశారు. తర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపక భాగస్వామి లక్షణ ఆస్థానా మాట్లాడుతూ..నాణ్యమైన అభ్యాస వాతావరణం కమ్యూనిటీల సాధికారతకు కీలకమని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా జ్ఞానం, ఉత్సుకత, అభ్యాసాన్ని ప్రోత్సహించే లైబ్రరీ వాతావరణాన్ని సృష్టించగలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కొల్లాపూర్‌లో విద్యకు కొత్త ఊపిరి పోసినట్టయ్యిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.