Cash Limit At Home: మీరు ఇంట్లో ఎంత డబ్బును ఉంచుకోవాలో తెలుసా?
భారతదేశంలో అనేక సార్లు ఒకే ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దొరికిందనే వార్తలు వస్తూనే ఉంటాయి. ఆదాయపు పన్ను విభాగం ఒక వ్యక్తి ఇంటిలో లేదా కార్యాలయంలో దాడులు చేసి అక్కడ పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని వింటుంటాం.
- By Gopichand Published Date - 01:02 PM, Thu - 24 April 25

Cash Limit At Home: భారతదేశంలో అనేక సార్లు ఒకే ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దొరికిందనే వార్తలు వస్తూనే ఉంటాయి. ఆదాయపు పన్ను విభాగం ఒక వ్యక్తి ఇంటిలో లేదా కార్యాలయంలో దాడులు చేసి అక్కడ పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని వింటుంటాం. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు నగదును జప్తు చేస్తారు. కొన్నిసార్లు వ్యక్తిని అరెస్టు కూడా చేస్తారు. దీనివల్ల చాలామందిలో ఒక సందేహం వస్తుంటుంది. ఇంట్లో ఎక్కువ నగదు ఉంచడం (Cash Limit At Home) చట్టవిరుద్ధమా? ఇంట్లో ఎంత నగదును ఉంచవచ్చు? అనే ప్రశ్నలు వస్తుంటాయి.
ఈ విషయంపై పన్ను, చట్ట నిపుణులు చెప్పేది ఏమిటంటే..ఇంట్లో ఎంత నగదు ఉంచవచ్చనే దానికి ఆదాయపు పన్ను విభాగం ఎలాంటి పరిమితిని నిర్దేశించలేదు. అంటే మీరు ఇంట్లో ఎంత మొత్తం నగదైనా ఉంచవచ్చు. కానీ ఆ డబ్బు చట్టబద్ధంగా సంపాదించినదై ఉండాలి. అది మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో పేర్కొనబడి ఉండాలి.
నగదు మూలాన్ని తెలపడం తప్పనిసరి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 నుండి 69B వరకు మూలం లేని ఆదాయానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. మీరు నగదు మూలాన్ని వివరించలేకపోతే ఆ డబ్బును మూలం లేని ఆదాయంగా పరిగణించి, దానిపై భారీ పన్ను, జరిమానా విధించవచ్చు.
పన్ను రిటర్న్, రికార్డులలో సమాచారం ఉండాలి
చట్టం నగదు ఉంచడానికి గరిష్ట పరిమితిని గురించి నేరుగా ఏమీ చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి వద్ద అవసరానికి మించిన నగదు ఉంటే.. దాని మూలం స్పష్టంగా లేకపోతే అనుమానం రావడం సహజం. ఏదైనా విచారణ సందర్భంలో మీరు ప్రతి రూపాయి మూలాన్ని నిరూపించాలి. అది చట్టబద్ధమైనదని, మీరు దానిని మీ పన్ను రిటర్న్, ఖాతాలలో నమోదు చేసినట్లు చూపించాలి.
Also Read: Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి
78% వరకు పన్ను, జరిమానా
మీరు నగదు సరైన మూలాన్ని చూపించలేకపోతే ఆ మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించి, దానిపై సుమారు 78% పన్ను, జరిమానా విధించవచ్చు. మీరు వ్యాపారి అయితే మీ క్యాష్‌బుక్ మీ ఖాతాలతో సరిపోలాలి. మీరు వ్యాపారి కాకపోయినా నగదు మూలాన్ని తెలపడం తప్పనిసరి. కాబట్టి నగదు ఉంచడానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ డబ్బు నీతితో సంపాదించినదై ఉండాలి. దాని పూర్తి లెక్కలు అందుబాటులో ఉండాలి.