Xiaomi : షావోమీకి యాపిల్, శాంసంగ్ లీగల్ నోటీసులు
ఇటీవలి నెలలుగా షావోమీ తన నూతన హైఎండ్ ఫోన్లను ప్రమోట్ చేయడంలో కొత్త రూట్ తీసుకుంది. తన తాజా "షావోమీ 15 అల్ట్రా" ఫోన్‌ను యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌లతో నేరుగా పోల్చుతూ, వాటిని తక్కువగా చూపేలా వ్యంగ్య ప్రకటనలు విడుదల చేసింది.
- By Latha Suma Published Date - 02:32 PM, Thu - 28 August 25

Xiaomi : ప్రపంచ ప్రీమియం మొబైల్ మార్కెట్ దిగ్గజాలు అయిన యాపిల్, శాంసంగ్‌లు ఇప్పుడు చైనా కంపెనీ షావోమీపై న్యాయపరంగా ఉక్కుపాదం మోపాయి. తమ ఉత్పత్తులను మించిపోయినట్లు ప్రచారం చేస్తూ వాణిజ్య ప్రకటనల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొంటూ ఈ రెండు సంస్థలు షావోమీకి లీగల్ నోటీసులు జారీ చేశాయి. ఇటీవలి నెలలుగా షావోమీ తన నూతన హైఎండ్ ఫోన్లను ప్రమోట్ చేయడంలో కొత్త రూట్ తీసుకుంది. తన తాజా “షావోమీ 15 అల్ట్రా” ఫోన్‌ను యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌లతో నేరుగా పోల్చుతూ, వాటిని తక్కువగా చూపేలా వ్యంగ్య ప్రకటనలు విడుదల చేసింది. భారతదేశంలో ప్రముఖ పత్రికల్లో ఏప్రిల్‌లో ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనలో ఐఫోన్ కెమెరా షావోమీ 15 అల్ట్రాను ఓడిస్తుందనుకునేవారికి హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ పరోక్షంగా ఎగతాళి చేసింది.
Read Also: Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
తదుపరి ప్రచారాల్లోనూ ఇదే ధోరణిని కొనసాగించిన షావోమీ ఇప్పుడు సరైన లెన్స్ ద్వారా చూడాల్సిన సమయం వచ్చింది అంటూ ఐఫోన్ కెమెరా పనితీరును చిన్నచూపుగా చూపించేందుకు యత్నించింది. శాంసంగ్‌పై కూడా విరుచుకుపడి, తక్కువ ధరలో తన మొబైల్‌లు మెరుగైన పనితీరును అందిస్తున్నాయంటూ ప్రకటనలు జారీ చేసింది. యాపిల్, శాంసంగ్‌లు తమ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్న విషయం ఏంటంటే ఈ రకమైన ప్రచారాలు తాము నిర్మించుకున్న ప్రీమియం బ్రాండ్ విలువలను హరించేందుకు ప్రయత్నించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలాంటి అత్యంత కీలకమైన మార్కెట్‌లో ఈ ప్రకటనల ప్రభావం తమ మార్కెట్ షేర్‌పై పడే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.
వాణిజ్య ప్రపంచంలో ఒక బ్రాండ్ తన ఉత్పత్తిని ఇతరులతో పోల్చి చూపడం సర్వసాధారణం. కానీ, షావోమీ గడిచిన కొన్ని నెలలుగా తూచ తప్పిన ధోరణితో పోటీ బ్రాండ్‌లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలతో ప్రచారం నడిపించడం సంస్థల సహనాన్ని మించి పోయింది. యాపిల్, శాంసంగ్‌లు నోటీసుల్లో తక్షణమే ఆ ప్రకటనలను ఉపసంహరించాల్సిందిగా కోరడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటి వరకు తక్కువ, మధ్యస్థ ధరల మొబైల్ ఫోన్లతో భారత మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన షావోమీ, ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. యాపిల్, శాంసంగ్‌లు ఇప్పటికే బలంగా ఉన్న ఈ విభాగంలో నిలదొక్కుకోవాలంటే అసాధారణమైన ప్రచారమే కావాలనో, లేదంటే ఆకర్షణీయమైన స్ట్రాటజీ కావాలనో షావోమీ భావించినట్లుంది. కానీ అది ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. షావోమీ ఈ నోటీసులపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ యాపిల్, శాంసంగ్‌లు స్పందించిన తీరు చూస్తే, ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. వాణిజ్య ప్రకటనలు ఎంతవరకు “సృజనాత్మక విమర్శ”గా పరిగణించాలి, ఎక్కడ అది “పోటీ దౌర్జన్యం”గా మారుతుంది అనే చర్చకు ఇది ముద్రిత ఉదాహరణగా నిలవనుంది.