Air Taxis: త్వరలో ఎగిరే కార్లు.. 2027 నాటికి సేవలు ప్రారంభం!
ప్రస్తుతం టోక్యో నుంచి నరిటా ఎయిర్‌పోర్ట్‌కు కారు లేదా రైలులో వెళ్లాలంటే కనీసం ఒక గంట పడుతుంది. కానీ Joby Aviation ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ దూరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
- By Gopichand Published Date - 04:11 PM, Sat - 16 August 25

Air Taxis: మనం సినిమా, గేమ్స్‌లో చూసిన ఎగిరే కార్లు (Air Taxis) ఇకపై వాస్తవంగా మారబోతున్నాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ కంపెనీ ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA), కాలిఫోర్నియాకు చెందిన Joby Aviation కలిసి 2027 నాటికి జపాన్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి. ఈ విప్లవాత్మక సేవ కింద 100 కంటే ఎక్కువ 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులతో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ANA అధ్యక్షుడు కోజీ షిబాటా తెలిపారు. ఉదాహరణకు టోక్యో నుండి నరిటా ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుతం కారులో ఒక గంట పట్టే ప్రయాణం ఈ ఎయిర్ టాక్సీలో కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది.
సాధారణ ప్రజలకు అందుబాటులో ధర
Joby Aviation వ్యవస్థాపకుడు జోబెన్ బెవిర్ట్ మాట్లాడుతూ.. ఈ ఎయిర్ టాక్సీలు పర్యావరణానికి కూడా సురక్షితమైనవని. అవి పూర్తిగా ఎలక్ట్రిక్ కావడం వల్ల పొగ, శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు హెలికాప్టర్‌లా టేకాఫ్ చేసి, ఆ తర్వాత విమానంలా ఎగురుతాయి. ఈ ఎయిర్ టాక్సీల టికెట్ ధర ఇంకా ప్రకటించనప్పటికీ.. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ధర నిర్ణయిస్తామని ANA పేర్కొంది. ఒసాకాలో జరిగే ఎక్స్‌పో 2025 సందర్భంగా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రజా ప్రదర్శన కూడా జరగనుంది. జపాన్ సాంప్రదాయ, ఆధునిక సాంకేతికతల సమ్మేళనం వల్ల ఈ కొత్త టెక్నాలజీకి సరైన ప్రదేశమని బెవిర్ట్ తెలిపారు.
Also Read: Sanju Samson: సంజూ శాంసన్ కోసం రంగంలోకి కేకేఆర్?!
1 గంట ప్రయాణం 15 నిమిషాల్లో పూర్తి
ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీల వల్ల ప్రయాణ సమయం ఎంత మేర ఆదా అవుతుందో వివరించడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ప్రస్తుతం టోక్యో నుంచి నరిటా ఎయిర్‌పోర్ట్‌కు కారు లేదా రైలులో వెళ్లాలంటే కనీసం ఒక గంట పడుతుంది. కానీ Joby Aviation ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ దూరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, ప్రయాణికులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ANA అధ్యక్షుడు, సీఈఓ కోజీ షిబాటా మాట్లాడుతూ.. ఈ సేవలు తమ విమాన ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చివేస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఈ సర్వీసులను మరింత విస్తృతం చేసే ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇది ప్రపంచవ్యాప్తంగా నగర ప్రయాణాలకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.