Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జింగ్ తో 500 కిలోమీటర్ల రైడ్!!
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో అనతి కాలంలోనే చెరగని ముద్రవేసిన "ఓలా" మరో ఆవిష్కరణతో ముందుకు వస్తోంది.
- By Hashtag U Published Date - 11:28 AM, Mon - 15 August 22

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో అనతి కాలంలోనే చెరగని ముద్రవేసిన “ఓలా” మరో ఆవిష్కరణతో ముందుకు వస్తోంది. ఆగస్టు 15న స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. దీన్ని ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు పైగా జర్నీ చేయొచ్చని అంటున్నారు. ఇందుకోసం కారులో అధునాతన బ్యాటరీలను వాడినట్లు సమాచారం. లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అత్యుత్తమంగా స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు ఉంటుందని అంటున్నారు.
ఓలా సీఈవో సోషల్ ప్రచారం..
దీనికి సంబంధించి ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. ఆగస్టు 15న తాము ఏం ఆవిష్కరించబోతున్నామో ఊహించగలరా అంటూ ట్విటర్‌లో పోల్ కూడా పెట్టారు. స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయబోతున్నారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తక్కువ రేటుతో కొత్త ఎస్1 తెస్తున్నారని మరికొంత మంది పేర్కొన్నారు. ఓలా సెల్ ఫ్యాక్టరీ, సరికొత్త కలర్‌లో ఎస్1 ఆవిష్కరిస్తారని ఇంకొందరు అంచనా వేస్తున్నారు.
2025లో మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ కారు..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2025 సంవత్సరంలో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2024-25లో ప్రారంభించనుంది. గుజరాత్‌లోని కంపెనీ ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. EV సాంకేతికత మరియు బ్యాటరీలు ఖరీదైనవి కాబట్టి మొదటి మారుతి ఎలక్ట్రిక్ కారు ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని ధృవీకరించింది. మొదటి మారుతి ఎలక్ట్రిక్ కారు మిడ్ రేంజ్ SUV అనే వార్తలు వినిపిస్తన్నాయి. దీనిని సుజుకి, టయోటా కలిసి అభివృద్ధి చేస్తారు.