Electric Vehicles : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనబోతున్నారా ? ఈ రిపోర్ట్‌పై లుక్కేయండి
పెట్రోలుతో నడిచే స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Vehicles)లో సమస్యలు డబుల్ స్థాయిలో బయటపడుతున్నాయి.
- By Pasha Published Date - 09:49 AM, Sun - 6 April 25

Electric Vehicles : ఇటీవల కాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలామంది పెట్రోలు బైక్‌లు, స్కూటర్లను వదిలేసి.. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను కొనేస్తున్నారు. ఈక్రమంలో ఒకే ప్రశ్నపై అందరూ ఫోకస్ పెడుతున్నారు. తాము ఈవీకి ఎంతసేపు ఛార్జింగ్ పెడితే.. ఎంత మైలేజీ వస్తుందనేది అడిగి సరిపెడుతున్నారు. ఇంకా చాలావిషయాలను తెలుసుకోవడం లేదు. ఇలాంటి వాళ్లంతా తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుపై జేడీ పవర్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసిన అంశాలనైనా కచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొత్తగా వాహనాలు కొన్న 6,500 మందిని సర్వే చేసి ఈ రిపోర్టును రూపొందించారు.
Also Read :BJP Vs MIM : మజ్లిస్‌తో బీజేపీ ‘లోకల్’ ఫైట్.. బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం!
ఈవీలపై జేడీ పవర్ నివేదికలోని అంశాలివీ..
- పెట్రోలుతో నడిచే స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Vehicles)లో సమస్యలు డబుల్ స్థాయిలో బయటపడుతున్నాయి.
- ప్రతీ 100 ఎలక్ట్రిక్ స్కూటర్లకుగానూ 98 స్కూటర్లలో సమస్యలు బయటపడ్డాయి.
- ప్రతీ 100 పెట్రోలు స్కూటర్లకుగానూ 53 స్కూటర్లలో మాత్రమే సమస్యలు బయటపడ్డాయి.
- ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కొద్దీ సాంకేతిక సమస్యలు పెరుగుతున్నాయి.
- ఈవీని కొన్న మొదటి ఆరు నెలల్లో 2,500 కిలోమీటర్లకు మించి నడిపిన కస్టమర్లు, తక్కువ ప్రయాణం చేసినవారితో పోలిస్తే సగటున 9 శాతం ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు.
- ఈవీలలోని బ్రేక్స్, లైట్స్, ఎలక్ట్రికల్ విడిభాగాలతోపాటు వాహన పటుత్వం, ఫినిషింగ్ సమస్యలు ఎక్కువగా బయటపడ్డాయి.
- ఈవీ స్కూటర్ల విభాగంలో అతి తక్కువ సమస్యలు బయటపడుతున్న టూవీలర్ మోడల్‌లో బజాజ్ చేతక్ ఉంది.
- పెట్రోలు స్కూటర్ల విభాగంలో అతి తక్కువ సమస్యలు బయటపడుతున్న టూవీలర్ మోడల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉంది.
- భారత దేశంలోని 86 శాతం ద్విచక్ర వాహనాల్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిలో ఇంజిన్ సమస్యలు 18 శాతం ఉన్నాయి. ఎలక్ట్రికల్ విడిభాగాలు, లైటింగ్ సంబంధిత సమస్యలు 15శాతం ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్స్ సమస్యలు 15 శాతం ఉన్నాయి.
- తమ వాహనాలకు ఊహించిన దానికంటే తక్కువ సమస్యలే ఉన్నాయని సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది చెప్పారు. ఇదే విషయాన్ని ఎలక్ట్రిక్ వాహనాల యజమానులను అడగగా.. ఈవీలలో తాము ఊహించిన దానికంటే తక్కువ సమస్యలే వచ్చాయని 61 శాతం మంది చెప్పారు.