TDP Mahanadu : మహానాడుపై ‘అధికార’ దర్పం
రాజకీయ పార్టీలు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం సహజం. ఆ సందర్భంగా ప్లెక్సీలు, హోర్డింగ్ లు, వాల్ పోస్టర్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలు కట్టడం చూస్తుంటాం.
- By Hashtag U Published Date - 03:27 PM, Wed - 25 May 22

రాజకీయ పార్టీలు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం సహజం. ఆ సందర్భంగా ప్లెక్సీలు, హోర్డింగ్ లు, వాల్ పోస్టర్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలు కట్టడం చూస్తుంటాం. మహానాడు సందర్భంగా టీడీపీ కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు, హోర్డింగ్ , కటౌట్ లు పెట్టింది. కానీ, ఒంగోలు కార్పొరేషన్ అధికారులు టీడీపీ పెట్టిన హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఇతరత్రా అలంకరణలను తొలగించింది. జెండాలు, తోరణాలను తొలగిస్తూ ఒంగోలు కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. ఫలితంగా మహానాడుపై జగన్ సర్కార్ కుట్ర పన్నుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.
రెండు రోజుల పాటు ఒంగోలు కేంద్రంగా ఎన్టీయార్ జయంతి సందర్భంగా మహానాడును టీడీపీ నిర్వహిస్తోంది. ఈనెల 27, 28 తేదీల్లో ఆ వేడుక జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ క్యాడర్ ముమ్మరంగా చేసింది. ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతూ తోరణాలను, కటౌట్ లను ఏర్పాటు చేసింది. తొలి రోజు సుమారు 10వేల మంది పార్టీ క్యాడర్ తో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. వాళ్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈనెల 28న మహానాడు వేడుక సంబురంగా జరగనుంది. ఆ వేదికపై 2024 దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లే డైరక్షన్ ఇవ్వనుంది. పలు కీలక తీర్మానాలను కూడా చేయబోతుంది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు మహానాడు వేదికగా టీడీపీ శ్రీకారం చుట్టబోతుంది. ఈనెల 28వ తేదీ నుంచి 2023 28వ తేదీ వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి గ్రామానికి వెళ్లి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జరుపుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ వేడుకల్లో చంద్రబాబు, లోకేష్ పాల్గొంటారు. క్యాడర్ ను ఉత్సాహ పరిచేలా రూట్ మ్యాప్ ను పార్టీ తయారు చేసింది. ఏడాది పాటు ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగాలని ప్లాన్ చేశారు. రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ కు ఉన్న చెరగని ఇమేజ్ తో మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు స్కెచ్ వేశారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకులను ప్రారంభించడంతో పాటు లోకేష్ పాదయాత్రను కూడా మహానాడు వేదికపై ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆయన ఇచ్ఛాపురం నుంచి తిరుపతి వరకు ఏడాది పాటు పాదయాత్ర చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం అయిందని సమాచారం. ఇక చంద్రబాబు బస్సు యాత్ర కూడా ఉండేలా ప్రణాళికను సూచాయగా మహానాడులో ప్రకటించే అవకాశం ఉంది. క్యాడర్ ను ఉత్సాహ పరిచేలా ఏడాది పాటు ఉండే కార్యక్రమాలను ప్రకటించడానికి రంగం సిద్ధం అయింది. వలంటీర్ల వ్యవస్థకు సమాంతరం ఉండే ఎల్లో సోల్జర్స్ ను రంగంలోకి దింపే తీర్మానం కూడా మహానాడు వేదికపై ప్రకటించడానికి టీడీపీ స్కెచ్ వేసిందని తెలుస్తోంది.
అట్టహాసంగా నిర్వహించే మహానాడును అడ్డుకోవడానికి అధికారపక్షం ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెంనాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీఏ వాహనాలను ఇవ్వకుండా అడ్డుపడిందని చెబుతున్నారు. కాలేజీ, స్కూల్ వాహనాలను మహానాడుకు ఇవ్వకుండా ఒంగోలు ఆర్టీఏ అధికారులు హుకుం జారీ చేశారని గుర్తు చేశారు. మహానాడుకు వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు పోలీసులు, రోడ్డు రవాణ అధికారులు ప్రయత్నం చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇంకో వైపు తాజాగా ఒంగోలు కార్పొరేషన్ అధికారులు మహానాడు ఏర్పాట్లను అడ్డుకోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈసారి మహానాడును 2024 ఎన్నికల దిశగా సక్సెస్ చేయాలని టీడీపీ చూస్తుంటే, అధికార పక్షం మాత్రం తనదైన శైలిలో అడ్డుపడుతుందని విమర్శలు రావడం గమనార్హం.