MLA Pinnelli : ఏపీలో ఈవీఎం ధ్వంసం కేసు.. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్
పోలింగ్ వేళ ఈనెల 13న ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు.
- Author : Pasha
Date : 22-05-2024 - 4:18 IST
Published By : Hashtagu Telugu Desk
MLA Pinnelli : పోలింగ్ వేళ ఈనెల 13న ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు. ఆయన కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు.. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు పిన్నెల్లి కాన్వాయ్‌ను పల్నాడు పోలీసులు వెంబడించారు. పోలీసుల కళ్లుగప్పి ఓ కారులో పారిపోయేందుకు పిన్నెల్లి యత్నించారు. పిన్నెల్లి అరెస్టుకు కొన్ని గంటల ముందు ఆయన డ్రైవరును సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నించే అవకాశం ఉందని తొలుత పోలీసు వర్గాలు అనుమానించాయి. దీనిపై అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అలర్ట్ చేశారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై(MLA Pinnelli) ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలోని పది సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ఆర్పీ చట్టంలోని 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈమేరకు అభియోగాలతో ఈనెల 20వ తేదీనే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే పోలీసులకు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చారు.
Also Read :Palestinian State : ప్రత్యేక పాలస్తీనాను గుర్తించిన ఐర్లాండ్, స్పెయిన్, నార్వే
అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు షెల్టర్ ఇచ్చినట్లు తెలిసింది. ఆంధ్రా మూలాలు ఉన్న పత్తి వ్యాపారులు ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు.చివరకు సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి సోదరులు పోలీసులకు దొరికిపోయారు.