ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదుః వైఎస్ షర్మిల
ys sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ..సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం
- By Ramesh Published Date - 06:11 PM, Mon - 29 January 24

ys sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ..సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మీడియాలో జగన్ తో సమానంగా తనకు కూడా సగం వాటా ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్‌ఆర్ పత్రికలో జగన్ కు, తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. ఇప్పుడున్న జగన్(jagana)ఎవరో తనకు తెలియదని షర్మిల అన్నారు.
We’re now on WhatsApp : Click to Join
గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని… సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై… రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా… అత్యంత నీచంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఎవరెంత చేసినా భయపడే ప్రసక్తే లేదని… ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఒక్కడే పుట్టానని, జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైఎస్‌ఆర్‌సిపి క్యాడర్ కు గుర్తులేవన్నారు. తన మీద రోజుకొక కథ అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు రోజుకొక జోకర్ ను తెస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా? అని ప్రశ్నించారు. తాను రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డినని… ఇదే తన ఉనికి అని చెప్పారు.
నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్‌ఆర్ వ్యక్తిత్వమని… అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్దపెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నాని విమర్శించారు. వైఎస్ బతికుంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. బిజెపికి స్నేహితుడిగా ఉన్న జగన్… కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్… ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు. కడప – బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు. జగన్ ను బయటకు రానివ్వొద్దని, షర్మిలను సీఎం చేయాలని లాబీయింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలకు సీఎం కావాలనుందని, ప్రణబ్ ముఖర్జీతో, సోనియాతో తన భర్త చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీరెడ్డితో కలిసే సోనియాగాంధీ వద్దకు అనిల్ వెళ్లారని తెలిపారు. మరి సోనియాతో తన భర్త ఈ విషయం గురించి భారతీరెడ్డి ముందు మాట్లాడారా? లేక వెనుక మాట్లాడారా? అని ప్రశ్నించారు. తనకు పదవులే కావాలనుకుంటే తన తండ్రి సీఎం అయినప్పుడే తీసుకునేదాన్నని చెప్పారు.