YSR’s Birth Anniversary : వైస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళులు
మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు
- By Sudheer Published Date - 09:28 AM, Mon - 8 July 24

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75 వ జయంతి (YS Rajasekhara Reddy s 75th birthday) నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర ఆయన కుమారుడు , మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి తదితర వైసీపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టిన తల్లిని జగన్ ఓదార్చారు.
ఇదిలా ఉంటె ఈరోజు వైస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం మూడు గంగాతలకు బేగం పేట్ నుండి ప్రత్యేక విమానంలో వీరు విజయవాడ కు చేరుకోనున్నారు. మూడు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో కలిసి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఇందులో భాగంగానే ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
ఇక వైస్సార్ (YS Rajasekhara Reddy ) విషయానికి వస్తే..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న రాజశేఖర్ రెడ్డి జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్‌గా గుర్తింపు పొందారు. తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైస్సార్..మంత్రిగా , ప్రతిపక్ష నేత గా , ముఖ్యమంత్రి గా ఎన్నో సేవలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
Read Also : YS Jagan – Vijayamma : ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్‌తో విజయమ్మ.. జగన్‌ను హత్తుకొని కన్నీరు పెట్టుకొని..