Annamayya Project : ముంచినా..జగన్‌కే జై.!,ప్రపంచ వింత ఆ ప్రాజెక్టు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వరదల్లో భేషుగ్గా పనిచేశాడని అక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
- Author : CS Rao
Date : 06-12-2021 - 1:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వరదల్లో భేషుగ్గా పనిచేశాడని అక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వాళ్ల తప్పిదం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు అపాయం నుంచి తప్పుకోలేకపోయారట. ఆ విషయాన్ని చిత్తూరు, కడప పర్యటనకు ఆయన రెండు రోజుల పాటు వెళ్లిన సందర్భంగా ప్రజలు నుంచి వచ్చిన స్పందన అది. ఆ విధమైన స్పందన ఎప్పుడూ గతంలో చూడలేదు. ఏదైన ఉపద్రవం, పకృతి వైపరిత్యం సంభవించినప్పుడు అందరికీ సహాయం అందించడం చాలా కష్టం. అలాంటిది అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యం కారణంగా 62 మంది చనిపోయినప్పటికీ జగన్ సర్కార్ శభాష్ అనిపించుకుంటోంది.పార్లమెంట్ వేదికగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సాక్షాత్తూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తేల్చేశాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు వైఫల్యాన్ని మోడల్ గా తీసుకుని అధ్యయనం చేయాలని ఆదేశించాడు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ విషయంలో తప్పు జరిగిందని పార్లమెంట్ వేదికగా ప్రకటించాడు. ప్రపంచంలో ఇంజనీర్లు ఇదొక కేసు స్టడీగా తీసుకోవాలని షెకావత్ సూచించాడు. సరిగ్గా ఇదే పాయింట్ ను చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తున్నాడు. జగన్ సర్కార్ వైఫల్యం మీద ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని అంటున్నాడు. ఇలా జరగడం ఏపీ ప్రజలకు అవమానంగా బాబు భావిస్తున్నాడు.
సాధారణంగా తుఫాన్ లు, వరదలు, ఇతరత్రా వాతావరణ మార్పులను వాతావరణశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేస్తోంది. ఆ సమాచారం ఆధారంగా ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి ఏ సర్కార్ అయినా ముందుకు కదులుతోంది. కానీ, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే, 18వ తేదీన వాతావరణశాఖ వర్షం ప్రభావం గురించి తెలియచేసింది. ఆ రోజున కలెక్టర్ ప్రకటన ప్రకారం ఉదయం 8.30గంటలకు పించా ప్రాజెక్ట్ లో 3,845 క్యూసెక్కుల నీరు ఉంది. ఆ రోజు రాత్రి 8.30గంటలకు కి 90వేల క్యూసెక్కులకు చేరింది. అర్థరాత్రి కల్లా అన్నమయ్య ప్రాజెక్టు కు నీరు 1.17లక్షలు క్యూసెక్కులు చేరుకుంది.
ఆ సమయంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వాటర్ ఇన్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసే ఒక వ్యవస్థను ఎప్పటి నుంచో ఉంది. కానీ, యంత్రాంగం దాని గురించి పట్టించుకోకపోగా, నిఘా వర్గాలు కూడా సీఎంకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
ప్రాజెక్టులోని నీళ్లు లోతట్టు ప్రాంతాలను ముంచుతాయని ఒక లస్కర్ చెప్పాడు. అతను కూడా చెప్పకపోతే, 62 మంది కాదు..చాలా పెద్ద సంఖ్య లో ప్రాణనష్టం జరిగేది. ఇవే పాయింట్ల మీద కేంద్రం స్టడీ చేస్తోంది.
ఏపీ ప్రభుత్వ వైఫ్యలం ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ….ప్రాజెక్టు నీటితో మునిగిపోయిన జనం మాత్రం కడప పరామర్శకు వెళ్లిన జగన్ కు జేజేలు పలకడం విచిత్రం. అంతేకాదు, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, అంబటి రాంబాబులు గత చంద్రబాబు సర్కార్ చేతగానితనం కారణంగా ఇప్పుడు ప్రమాదం జరిగిందని రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం మీద అన్నమయ్య ప్రాజెక్టు వరదకు రాజకీయ బురద తోడు కావడం ప్రపంచ వింతగా కనిపిస్తోంది.