YS Jagan : జగన్ పాలనకు ప్రపంచ స్థాయి గుర్తింపు?
ఏపీ సీఎం జగన్ పాలనకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు రావడానికి మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వరకు ఆయన పాలన వెళ్లనుంది. ఆ మేరకు కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని తెలుస్తోంది.
- By CS Rao Published Date - 05:14 PM, Mon - 2 May 22

ఏపీ సీఎం జగన్ పాలనకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు రావడానికి మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వరకు ఆయన పాలన వెళ్లనుంది. ఆ మేరకు కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని తెలుస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు, ఐక్యరాజ్య సమితికి రైతు భరోసా కేంద్రాల పనితీరును అందచేసిందని ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రపంచ స్థాయిలో అందుకునే గౌరవ పురస్కారానికి నామినేట్ చేసిందని సర్వత్రా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
సాధారణంగా ప్రతి ఏడాది గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన తదితర అంశాలపై ఫోకస్ పెట్టిన పాలకుల నుంచి ఐక్యారాజ్యసమితి నామినేషన్లను కోరుతుంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి దరఖాస్తుల రూపంలో ప్రతిపాదనలను వస్తుంటాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనలను పంపుతుంటాయి. ఈసారి భారత దేశం నుంచి జగన్ తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఐకేపీ కేంద్రాల పనితీరును పురస్కారం కోసం కేంద్రం నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి కేంద్రం చేరవేసిందని టాక్.
2019 ఎన్నికల్లో సింపుల్ మేనిఫెస్టోను జగన్ తయారు చేశారు. దాన్లో రైతు భరోసా స్కీం ఒకటి . ఆయన ప్రకటించిన నవరత్నాల జాబితాతో పాటు రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల వ్యవస్థ పాలనా సంస్కరణల్లో భాగం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ప్రగతి సాధ్యం అనే సిద్ధాంతాన్ని స్వర్గీయ వైఎస్ నమ్మిన సిద్ధాంతాన్ని జగన్ విశ్వసిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తొలి నుంచి అన్నపూర్ణగా పేరుగాంచింది. వ్యవసాయం మీద ఇప్పటికే 60శాతం ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అందుకే, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను జగన్ సర్కార్ పెట్టింది.
వ్యవసాయ, అనుబంధ రంగాలనూ ఆదుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నం ఐకేపీ సెంటర్లు. ఎరువులు, పురుగు మందులను అందించడంతో పాటు సీజన్ వారీగా పంటలకు వచ్చే తెగుళ్ల గురించి అగ్రికల్చర్ నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. భూసార పరీక్షల నుంచి పంటల మార్పిడి వరకు ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ బ్రైన్ చైల్డ్ గా పేరున్న రైతు భరోసా కేంద్రాలకు అనూహ్యంగా యునెస్కో నుంచి గుర్తింపు వస్తుందని వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు.
కేంద్రం అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఐక్యరాజ్య సమితికి పంపింది. ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ అంశంపై సానుకూలంగా ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి మంచి వ్యవస్థ లేదని ఎఫ్ఏఓ ప్రతినిధి (కంట్రీ హెడ్ ) టోమియో షిచిరీ చెబుతున్నారు. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో లేనేలేదని చెబుతూనే, ఇక్కడి వసతులు, సౌకర్యాలు చూసి అబ్బురపడ్డారాయన. ఐకేపీ కేంద్రాల ఏర్పాటు ఒక వినూత్న సంస్కరణగా ఐరాస భావిస్తే, జగన్ పాలనకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఖాయం. ఫలితంగా ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ వేవ్ అంతా ఐక్యరాజ్యసమితి ఇచ్చే పురస్కారంతో కొట్టుకుపోతుందని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. కేంద్ర ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఐరాస పురస్కారానికి నామినేట్ చేసిందని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారికంగా వెల్లడి కావాలి.