Jagan Meetings: జగన్ సభ నుంచి పారిపోతున్న జనం.. దేనికి సంకేతం?
ఈ మధ్య జగన్ సభలను గమనిస్తే ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
- Author : Hashtag U
Date : 17-05-2022 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్య జగన్ సభలను గమనిస్తే ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఖాళీ కుర్చీలు, గోడ దూకి వెళ్లిపోతున్న జనాలు.. ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అంత ఏవగింపు దేనికి? ఒకప్పుడు జగన్ వస్తున్నాడన్నా, మాట్లాడుతున్నాడన్నా.. జనం రెక్కించి వినేవారు. పాదయాత్రకు, ప్రచారానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అవే జగన్ గెలుపు ఖాయమనే సంకేతాలిచ్చాయి. ఇప్పుడు జగన్ వస్తున్నారు రండి.. అని జనాలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా ఉండడం లేదు. ఓవైపు జగన్ మాట్లాడుతున్నా సరే వెళ్లిపోతున్నారు.
మరి ఇది దేనికి సంకేతం? పార్టీగనక ఇలాంటివి విశ్లేషించుకోకపోతే భారీ నష్టం తప్పదు. ఏదో ఒకటి రెండు మీటింగులకు అలా జరిగినంత మాత్రాన నెగటివ్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కాని, సోషల్ మీడియా అనేది ఒక పవర్ ఫుల్ వెపన్ ఉందన్న విషయం మరిచిపోకూడదు. ఇదంతా పక్కన పెడితే.. జగన్ సభలకు ఎందుకు బలవంతంగా జనాన్ని తీసుకురావాల్సివస్తోంది, వచ్చిన వాళ్లంతా వెంటనే ఎందుకు వెళ్లిపోతున్నారన్నది విశ్లేషించుకోవాలి.
కేవలం అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తే సరిపోతుందా? అని జనం ప్రశ్నించబోతున్నారా? అభివృద్ధి, స్వయం సమృద్ధి లేదనే విషయం అర్థమవుతోందా? ఓవైపు డబ్బులు వేస్తూ అదే చేత్తో పన్నుల రూపంలో, కరెంట్ బిల్లుల రూపంలో లాగేసుకుంటున్నారన్న భావన ప్రజల్లోకి వచ్చేసిందా? నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ప్రజలపై భారం పడకుండా కాపాడుకుంటానన్న జగన్… ఆ హామీని విస్మరించినట్టే కనిపిస్తోంది.
జగన్ బాదుడే బాదుడు నిజమేనన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. పైగా కరెంట్ బిల్లులకు పథకాలకు లింక్ పెట్టడంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం గాని, కొత్త పెన్షన్ల మంజూరు గాని దాదాపుగా నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట ఏంటంటే.. జగన్ బటన్ నొక్కుతున్నారు గాని.. అందులోంచి పడే సొమ్ము అరకొరే అన్న మాట వినిపిస్తోంది. పూర్తిస్థాయిలో డబ్బులు పడకపోవడం, కొందరికి అసలు చేరకపోవడం, జనవరిలో పడాల్సిన అమ్మఒడి ఇంకా పడకపోవడం… ఇవన్నీ ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయని, అదే జగన్ సభల్లో కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.