TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- Author : Vamsi Chowdary Korata
Date : 04-07-2026 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె అచంచలమైన మనోబలం, దైవభక్తితో పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. #116yearoldwoman#Tirumala #SrivariMettu #HashtagU pic.twitter.com/jjW33rJ7oM
— Hashtag U (@HashtaguIn) July 4, 2026
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టం. అలాంటిది, 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతుండటాన్ని చూసిన ఒక భక్తురాలు వీడియో తీశారు.
ఈ బామ్మ తమిళనాడుకు చెందిన వారని తెలుస్తోంది. ఆమె మనోబలం, దైవభక్తిని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. “భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు”, “ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.