Human Bombs : ఉగ్రదాడులకు 20 మంది మానవబాంబులు ? ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి
ఆహీం ఉగ్రవాద సంస్థ ద్వారా ఇతర మతాల వారిని టార్గెట్‌గా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేయాలని సిరాజ్, సమీర్ అండ్ టీమ్(Human Bombs) నిర్ణయించారని అంటున్నారు.
- By Pasha Published Date - 06:56 PM, Mon - 26 May 25

Human Bombs : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో బయటపడిన ఉగ్రవాద లింకుల కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో విజయనగరానికి చెందిన సిరాజ్, సికింద్రాబాద్‌కు చెందిన సమీర్ చుట్టూ విచారణ నడుస్తోంది. వీరిద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు, ఏపీ పోలీసులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ఎన్‌ఐఏ అధికారులు సిరాజ్, సమీర్‌లకు ప్రశ్నలు సంధిస్తున్నారు. వారి నుంచి సమాధానాలను రాబడుతున్నారు. సిరాజ్ విచారణకు సహకరించకపోవడంతో.. తమదైన శైలిలో ప్రత్యేక పద్ధతుల్లో అతడితో నిజాలు చెప్పిస్తున్నారట.
Also Read :Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు
తన చర్యలను సమర్ధించుకుంటున్న సిరాజ్ ?
సిరాజ్‌ను ఎన్ఐఏ అధికారులు విచారించే క్రమంలో ఒక షాకింగ్ పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. అధికారులు ప్రశ్నించే సమయంలో సిరాజ్ అహంకారంతో కూడిన మాటలు మాట్లాడినట్లు సమాచారం. ‘‘నన్ను పట్టుకోకపోయి ఉంటే.. నేనేంటో చూపించేవాడిని’’ అని సిరాజ్ పొగరుగా కామెంట్ చేసినట్లు తెలిసింది. దీన్నిబట్టి సిరాజ్ మైండ్‌లో ఎంత లోతుగా ఉగ్రవాద భావజాలం పాతుకుపోయిందో అర్థంచేసుకోవచ్చు. సిరాజ్‌లో దాగిన తీవ్రవాద మనస్తత్వాన్ని, విధ్వంసక ఆలోచనలను ఈ కామెంట్స్ అద్దంపడుతున్నాయి. సిరాజ్‌లో పశ్చాత్తాప భావన రాలేదని, అతడు తాను చేసిన చర్యలను సమర్ధించుకుంటున్నాడని సమాచారం.
Also Read :Super Vision : కళ్లు మూసుకున్నా చూడొచ్చు.. చీకట్లోనూ చూడొచ్చు.. చైనా కాంటాక్ట్ లెన్స్ మహిమ
20 మంది మానవ బాంబులు ఎక్కడున్నారు ?
కీలకమైన అప్‌డేట్ ఏమిటంటే.. సిరాజ్, సమీర్, ఇసార్ అహ్మద్, జాకీర్ నాయిక్, షేక్ యాకూబ్, జాంఆలీ, షేక్ జావిద్ రబ్బాని కలిసి ఆహీం అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదర్, వరంగల్‌కు చెందిన ఫరహాన్ మొహియుద్దీన్‌లు కూడా వీరికి సహకరించారని వెల్లడైంది. ఆహీం ఉగ్రవాద సంస్థ ద్వారా ఇతర మతాల వారిని టార్గెట్‌గా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేయాలని సిరాజ్, సమీర్ అండ్ టీమ్(Human Bombs) నిర్ణయించారని అంటున్నారు. ఇందుకోసం పలుచోట్ల రెక్కీ కూడా నిర్వహించారట. దాడుల కోసం దాదాపు 20 మంది మానవ బాంబులను తయారు చేశారని తాజా విచారణలో గుర్తించారు. అయితే ఆ 20 మంది మానవ బాంబులు ఎవరు ? ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? అనేది తెలుసుకోవడంపై ఇప్పుడు పోలీసుల, ఎన్‌ఐఏ ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ వివరాలను నిందితుల నోటి నుంచి కక్కించేందుకు యత్నిస్తున్నారు.
ఐదారు రాష్ట్రాలకు ఆహీం ఉగ్రవాద నెట్‌వర్క్
తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకూ ఆహీం ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ విస్తరించి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కుట్రకు ప్లానింగ్, నిధులు అందించిన వారి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల పాత్రను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మరిన్ని అరెస్టులు జరుగుతాయని సమాచారం.