TTD Chairman : దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు..
- Author : Prasad
Date : 04-10-2022 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశారని చెప్పారు. కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలతో తులతూగేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు.