TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం
TTD: తిరుమల 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల 2008లో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
- By Kavya Krishna Published Date - 12:38 PM, Sat - 7 December 24

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు అందించనున్నట్టు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. 2008లో ప్రారంభమైన ఈ పథకం కొన్ని కారణాల వల్ల నిలిపివేయబడింది. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం అర్చనానంతర దర్శనం లేకపోవడంతో, ఈ పథకానికి భాగస్వామ్యమైన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది.
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకంలో భాగమైన దాతలకు సవరించిన సేవలు ఈ విధంగా ఉంటాయి. అర్చనానంతర దర్శనానికి బదులుగా, గరిష్టంగా 5 మందికి సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను అనుమతిస్తారు. రూ.2,500/- టారిఫ్‌లో 3 రోజులకు వసతి అందిస్తారు. అలాగే, సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందజేస్తారు. దర్శనం సమయంలో ఒక దుపట్టా , ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు. మొదటి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్ , 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందిస్తారు. అలాగే, సంవత్సరానికి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. ఈ పథకం 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
అదేవిధంగా, టీటీడీ ఈవో శ్యామలరావు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో శ్రీరంగం వైష్ణవులను సన్మానించారు. ఈ సందర్భంగా, 2.5 టన్నుల బరువుతో వాహన సేవలను నిర్వహిస్తున్న వైష్ణవుల సేవలు అమోఘమైనవని అన్నారు. వారు 32 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ వాహన సేవలో వాహన బ్యారర్లు తమ భక్తి భావంతో వాహనాలను మోస్తున్నారు, వీరంతా IT రంగం, రైల్వే, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు.
Read Also : Narendra Modi : అందరికీ నాణ్యమైన పాఠశాల విద్య అందించడానికి కేంద్రం కట్టుబడి ఉంది