TTD Calendars: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!
బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
- By Gopichand Published Date - 11:29 AM, Mon - 13 October 25

TTD Calendars: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు (TTD Calendars), డైరీల (Diaries) విక్రయాలను భక్తుల సౌకర్యార్థం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో ప్రారంభించింది. శ్రీవారి భక్తులు సులభంగా వీటిని పొందేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది.
క్యాలెండర్లు, డైరీల వివరాలు
టీటీడీ 2026 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు క్యాలెండర్లు, అలాగే శ్రీవారు, అమ్మవారు ఇరువురు ఉన్న క్యాలెండర్‌లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచింది.
ఆఫ్‌లైన్ విక్రయ కేంద్రాలు
ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాక తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాల భక్తుల కోసం విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ (హిమయత్ నగర్, జూబ్లీహిల్స్‌లోని ఎస్వీ ఆలయాలు), బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని టీటీడీ కౌంటర్లతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కల్యాణమండపాల్లో కూడా క్యాలెండర్‌లు, డైరీలను అందుబాటులో ఉంచారు.
Also Read: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల!
ఆన్‌లైన్ కొనుగోలు సౌలభ్యం
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే భక్తుల కోసం www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పొందే సౌలభ్యాన్ని కల్పించారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టీటీడీ డైరీలు, క్యాలెండర్లను పొందే సౌలభ్యం ఉంటుంది.
బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు అందజేశారు. ఈ విరాళాన్ని బర్డ్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తారు.