Indrakeeladri : రేపు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. రేపు (శుక్రవారం) మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి
- By Prasad Published Date - 05:37 PM, Thu - 19 October 23

రేపు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. రేపు (శుక్రవారం) మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి చేసిన ఏర్పాట్లు సజావుగా అమలవుతున్నాయని.. ఇకపైనా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు. శుక్రవారం కొండ దిగువన రహదారులన్నీ, క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడనున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ కింద వాహనాలకు అనుమతిని రద్దు చేసినట్లు తెలిపారు. సీతమ్మ వారి పాదాలు, మోడల్ గెస్ట్ హౌస్, కుమ్మరిపాలెం, వినాయకుని గుడి తదితర ప్రాంతాలన్నీ రద్దీగా ఉండే అవకాశం ఉందని.. అందువల్ల సర్వీస్ వాహనాలు మినహా పాసులు ఉన్న వాహనాలకు కూడా శుక్రవారం కొండపైకి అనుమతి ఉండదని వివరించారు. వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. అదనంగా 700 నుంచి 800 మంది సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. సామాన్య భక్తుల భద్రత లక్ష్యంగా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కమిషనర్ కాంతి రాణా టాటా విజ్ఞప్తి చేశారు.
Also Read: TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం