Tirupati laddu row : తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ దర్యాప్తు ప్రారంభం
నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు పరిశీలించనున్నారు.
- Author : Latha Suma
Date : 22-11-2024 - 7:31 IST
Published By : Hashtagu Telugu Desk
SIT Investigation : తిరుమలలో కల్తీ నెయ్యి కేసుపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న ఈ బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు పరిశీలించనున్నారు.
సిట్ దర్యాప్తులో భాగంగా డిఎస్పిలు సీతారామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం పాల్గొన్నట్టు తెలుస్తోంది. మరో బృందం తమిళనాడులోని దుండిగల్‌కు వెళ్లి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వెళ్లినట్లు సమాచారం.
కాగా, అలిపిరి వద్ద తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు బృందాలు లడ్డూల తయారీలో నెయ్యి వినియోగం తీరు గురించి తిరుమలలో, నెయ్యి కొనుగోళ్ల విధి విధానాల గురించి తిరుపతిలో అధికారిక వివరాల సేకరణతో దర్యాప్తు మొదలైంది.
తిరుమల క్షేత్ర అవసరాల కోసం టీటీడీ గత అయిదేళ్ల మధ్యకాలంలో కొనుగోలు చేసిన నెయ్యిలో కల్తీ నెయ్యి సరఫరా అయిందనే అంశం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు కావడం కూడా తెలిసిందే.