AP Politics : ముగ్గురు మంత్రుల్లో గుబులు,వారసత్వానికి జగన్ స్వస్తి,
వారసత్వ ఆస్తిగా రాజకీయం మారిపోయింది. ఆ పద్ధతి దేశానికి, రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్సుకాదు.
- Author : CS Rao
Date : 29-09-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
వారసత్వ ఆస్తిగా రాజకీయం మారిపోయింది. ఆ పద్ధతి దేశానికి, రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్సుకాదు. అయినప్పటికీ ఆస్తుల మాదిరిగా రాజకీయాన్ని వారసత్వంగా ఇవ్వడానికి వివిధ పార్టీల్లోని సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి సుమారు 40 మంది వారసులు రాజకీయ తెరమీద కనిపించారు. వాళ్లందరూ దాదాపుగా ఓడిపోయారు. మళ్లీ అదే బ్యాచ్ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. కానీ, వైసీపీ చీఫ్ జగన్ మాత్రం వారసులకు టిక్కెట్ల ఇవ్వలేనని తేల్చి చెప్పడం గమనార్హం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మాజీ మంత్రులు పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వాళ్లు తమ వారసులను 2024 ఎన్నికలకు దింపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, ఇటీవల గడపగడపకు వైఎస్ ఆర్ పార్టీ కార్యక్రమానికి వాళ్లు దూరంగా ఉంటూ వారసులకు అప్పగించారు. ఆ విషయాన్ని బుధవారం సమీక్షా సమావేశంలో ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి వారసులకు టిక్కెట్లు ఇవ్వలేనని చెప్పేశారు. దీంతో ఆ ముగ్గురు అయోమయంలో పడ్డారు.
సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అప్రతిహతంగా ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆయన ఫోటోను చూసి ఓటేయాలని ఆనాడు పిలుపునిచ్చారు. ఆ మేరకు ఓటర్ల కూడా ఆకర్షింతులయ్యారు. ఒక్కఛాన్స్ అంటూ ప్రాధేయపడడంతో ఏపీ ఓటర్లు సెంటిమెంట్‌కు విలువ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీకి ఇచ్చారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేవలం తన మొఖాన్ని చూసి ఓటేయమని అడిగే పరిస్థితి పోయింది. స్థానికంగా ఉండే ఎమ్మెల్మేలు స్ట్రాంగ్ గా ఉంటే గెలుపు సాధ్యమని జగన్మోహన్ రెడ్డి తాజా సర్వేల ద్వారా గ్రహించారట.
ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లలో 27 మంది కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. వాళ్లకు టిక్కెట్ల ఇవ్వలేనని దాదాపుగా చెప్పేసినట్టే. మరో 40 మంది వరకు చివరి రేస్ లో ఉండే అవకాశంలేదని తెలుస్తోంది. పైగా మంత్రులు, సీనియర్ల వారసులకు టిక్కెట్లు ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఢీలా పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను కొందరు చూసుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్లను వదులుకునేందుకు జగన్ సిద్ధపడ్డారట. మొత్తం మీద రాజకీయాల్లో వారసత్వం అనే జాఢ్యాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతిని అమలు చేయగలడో చూడాలి.