Uppada : భయం గుప్పిట్లో ఉప్పాడ ప్రజలు
Cyclone : భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి
- Author : Sudheer
Date : 17-10-2024 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
వాయుగుండం ప్రభావంతో కాకినాడ (D) ఉప్పాడ (Uppada) తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తీరాన్ని సమీపించేలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. తిరుపతి జిల్లా తడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ. వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది.
దీని ప్రభావంతో ఇవాళ కూడా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఇటు ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.
కడప జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అనేక కాలనీల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ఇటు అనంతపురంలో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నడిమి వంక ప్రాంతంలో కాలువకు నీరు చేరుతోంది. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురిసింది. గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు. ఇటు తెలంగాణ లోని పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.
Read Also : Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో సాధించిన తొలి విజయం, మరణ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చు..!