MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
MLC Elections : అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ప్రజలు మళ్లీ అదే కూటమికి విశేషమైన మద్దతు తెలుపడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి
- By Sudheer Published Date - 06:32 PM, Tue - 4 March 25

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ప్రజలు మళ్లీ అదే కూటమికి విశేషమైన మద్దతు తెలుపడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. రెండు స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Ravindra Jadeja: రవీంద్ర జడేజాను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణమిదే?
కృష్ణా-గుంటూరు ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించి, 67.51% ఓటు శాతంతో 82,320 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1,24,702 ఓట్లు పొంది, 62.59% ఓటు శాతం సాధించి 77,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూటమికి 58% ఓటు శాతం వచ్చినప్పటికీ, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది 65%కు పెరగడం గమనార్హం.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ పూర్తిగా వెనుకబడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే ధైర్యం కూడా వైసీపీ కనబరచలేకపోవడం, మద్దతు ఇచ్చిన అభ్యర్థులు తీవ్ర ఓటమిని ఎదుర్కోవడం పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి మూడవ స్థానంలో నిలిచారు. అలాగే వైసీపీ మద్దతు ప్రకటించిన తర్వాత పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మరింత నష్టపోయారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటుతో ప్రభుత్వ పనితీరును ఆశీర్వదించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
8 నెలల కూటమి పాలనపై ప్రజలు మరింత నమ్మకం పెంచుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో 57% ఓటు షేర్‌తో ప్రభుత్వం ఏర్పాటయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65% పైగా ఓటు షేర్ నమోదు కావడం చంద్రబాబు ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే దానికి నిదర్శనం. మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 స్థానాలు గెలుచుకున్న కూటమి, ఇప్పుడు మరో రెండు స్థానాలను గెలుచుకొని విజయాన్ని మరింత ఘనతతో నిలబెట్టుకోవడం విశేషం.