YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్ మధ్య వాగ్వాదం
ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు.
- By Pasha Published Date - 01:24 PM, Mon - 22 July 24
YS Jagan : ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఈ సెషన్‌కు జగన్‌తో పాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాజీ సీఎం జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. కనిపించిన వెంటనే ‘హాయ్ జగన్’ అని పలకరించారు. రోజు అసెంబ్లీకి రా జగన్(YS Jagan) అని రఘురామ కోరారు. అసెంబ్లీకి ప్రతిరోజూ వస్తే బాగుంటుందన్నారు. ‘‘రెగ్యులర్ వస్తాను… మీరే చూస్తారుగా’’ అని జగన్ బదులిచ్చారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా ? అని రఘురామ ఈసందర్భంగా అన్నారు. జగన్ చేతిలో చేయి వేసి రఘురామ మాట్లాడారు. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని పయ్యావుల కేశవ్‌ను రఘురామ కృష్ణరాజు కోరారు. తప్పని సరిగా అంటూ పయ్యావుల కేశవ్ లాబీలో నుంచి నవ్వుకుంటూ వెళ్లారు. ఇక రఘురామకు వైసీపీ ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
గవర్నర్ ప్రసంగం(AP Assembly) సమయంలో ‘సేవ్ డెమొక్రసీ’ ‘హత్యా రాజకీయాలు నశించాలి’ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. కొందరు వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ నజీర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. జగన్‌తో పాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం అనంతరం నిర్వహించిన బడ్జెట్ అకౌంట్స్ కమిటీ (బీఏసీ) సమావేశానికి వైఎస్సార్ సీపీ సభ్యులు హాజరుకాలేదు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నంబరు గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం జగన్‌కు ప్రతిపక్ష హోదా లేకున్నా.. ఆయన వాహనాన్ని అసెంబ్లీ లోపలికి నేరుగా అనుమతించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్లకార్డులు, నల్ల కండవాలతో అసెంబ్లీకి జగన్, వైఎస్సార్ సీపీ సభ్యులు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డ్స్, నల్ల కండవాలు తొలగించాలని కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పోలీసులకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అని ప్రశ్నించారు. ఈక్రమంలో పోలీసులకు జగన్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రోజులు ఇలాగే ఉండవంటూ పోలీసులను వైఎస్ జగన్ హెచ్చరించారు.