Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్
- Author : Vamsi Chowdary Korata
Date : 23-06-2026 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి (Sree Charani) నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో తిప్పేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.
ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల టీ20 బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ శ్రీ చరణి అగ్రస్థానం సాధించింది. నిరుదు జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన చరణి.. తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా విజయాల్లో కీలకమవుతూనే.. వ్యక్తిగతంగా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గతేడాది స్వదేశంలో 14 వికెట్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ తెలుగమ్మాయి.. పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్‌లోనూ చెలరేగిపోతోంది.
లీగ్ దశలో మూడు మ్యాచుల్లోనే ఈ మిస్టరీ స్పిన్నర్ 10 వికెట్లతో సత్తా చాటింది. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో చరణి టాప్‌లో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డీన్, లిన్సే స్మిత్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా.. మాజీ వరల్డ్ నంబర్ 1 సోఫియా ఎకిల్‌స్టోన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు టాప్-5లో చోటు దక్కలేదు.
Congratulations to #ShreeCharani on becoming the No. 1 ranked T20I bowler in the world! I still remember meeting Charani last year and listening to her speak about the challenges that marked her early journey in cricket. Her rise from those struggles to the top of world rankings…
— Lokesh Nara (@naralokesh) June 23, 2026
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతేడాది చరణిని కలిసినప్పటి సంగతులు గుర్తుచేసుకున్న లోకేశ్, ఆమె పడిన కష్టాల నుంచి ప్రపంచస్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి చరణి విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీచరణిని చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని ఆకాంక్షించారు.