Rayalaseema: రాయలసీమ లో ముగ్గురు మొనగాళ్లు..!
రాయలసీమ మీద ఏపీలోని ప్రధాన పార్టీల కన్ను పడింది. గత ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన వైసీపీకి ఈసారి రివర్స్ ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది.
- Author : CS Rao
Date : 21-11-2022 - 4:36 IST
Published By : Hashtagu Telugu Desk
రాయలసీమ మీద ఏపీలోని ప్రధాన పార్టీల కన్ను పడింది. గత ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన వైసీపీకి ఈసారి రివర్స్ ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుకు ఉదాహరణగా గత వారం జరిగిన చంద్రబాబు కర్నూలు సభను చూపుతున్నారు. అక్కడి ప్రజల్లో మార్పు వచ్చిందని టీడీపీ విశ్వసిస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ నుంచి కంపెనీలు వెళ్లేలా చేశాడని ప్రచారం చేస్తోంది. అక్కడ ప్రత్యేక పరిస్థితులను వివరిస్తూ కర్నూలుకు హైకోర్టు బెంచ్ ను 2019 ఎన్నికలకు ముందే ప్రతిపాదించిన విషయాన్ని బాబు గుర్తు చేస్తున్నారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే రాయలసీమ వ్యాప్తంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈసారి పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. ప్రజల మద్ధతును గమనించిన కేఈ బ్రదర్స్ కూడా చంద్రబాబు వెంట నడిచారు. ఇప్పటికే గ్రూపులను ఒకటిగా చేసిన చంద్రబాబు రాయలసీమలో దూకుడుగా వెళుతున్నారు. ఆ విషయాన్ని పసిగట్టిన వైసీపీ హైకమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదులుగా కొత్త మొఖాలను ఈసారి ఎన్నికల్లో పరిచయం చేయాలని యోచిస్తోందని వినికిడి.
Also Read: Revanth Reddy : రైతు సమస్యలపై పోరుకు సిద్ధమైన రేవంత్
దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని తెర మీదకు తీసుకువస్తూ న్యాయ రాజధాని అంశాన్ని హైలెట్ చేయడానికి వైసీపీ సిద్ధం అయింది. ఆ క్రమంలో కర్నూలు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం ఆ పార్టీ క్యాడర్ చేసింది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ, మరోవైపు టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆ సందర్భంగా సంయమనం కోల్పోయిన చంద్రబాబు వైసీపీ క్యాడర్ పై దురుసుగా మాట్లాడారు. దాన్ని రాయలసీమ పరిరక్షణ కమిటీ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా జగన్ అండ్ టీమ్ మార్చేస్తోంది.
ఆదోని, యెమ్మిగనూరు, పత్తికొండ సభలు మునుపెన్నడూ లేనివిధంగా చంద్రబాబుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కోసం టీడీపీ చేసిన పనులను వివరించారు. అదే సమయంలో రాయలసీమ నుంచి ప్రస్తుత ప్రభుత్వం పంపించిన కంపెనీల గురించి చెప్పారు చంద్రబాబు. ఇదే సమయంలో వైసీపీ కూడా రాయలసీమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలను చేస్తోంది.
Also Read: Chiranjeevi : కమలంలో `మెగా` గుభాళింపు?
ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులతోపాటు రాయలసీమలో తరచూ పర్యటిస్తున్నారు. జనసేన కూడా రాయలసీమ ప్రజలను ఆకర్షించడంపై దృష్టి సారించింది. ఏడాదిన్నర క్రితం అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడంతో వరద బాధితుల దయనీయ స్థితిని జనసేన పార్టీ ఎత్తిచూపింది. పునరావాస ప్యాకేజీ ప్రకటించినా ప్రజలు తాత్కాలిక షెడ్లలో నివాసం ఉన్న అంశాన్ని హైలెట్ చేసింది. మొత్తం మీద ముగ్గురున్న టీడీపీ ఎమ్మెల్యేల రాయలసీమ ఈసారి టీడీపీ స్వీప్ కావాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ క్రమంలో శ్రీ బాగ్ ఒప్పందం మరోసారి తెరమీదకు రావడాన్ని ఎలా అధిగమిస్తారో చూద్దాం.