TDP Janasena : పొత్తుపై `మహా`ఎత్తుగడ
రాజకీయాల్లో ఆరితేరిన లీడర్ నారా చంద్రబాబునాయుడు.
- By CS Rao Published Date - 12:51 PM, Fri - 3 June 22

రాజకీయాల్లో ఆరితేరిన లీడర్ నారా చంద్రబాబునాయుడు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తుంటారు. ఒంగోలు మహానాడు హిట్ అయిన తరువాత ఆయన ఎత్తుగడలను మార్చుకున్నారని తెలుస్తోంది. సింగిల్ గా 2024 ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. తాజాగా సేకరించిన సర్వే ప్రకారం టీడీపీ ఒంటరిగా పోటీచేసినప్పటికీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని తేలిందట. అందుకే, పొత్తు అంశంపై చంద్రబాబు ఇటీవల దాట వేస్తున్నారు. అంతేకాదు, పొత్తు సర్దుబాటు అనేది తేలికైన అంశం కాదని పరోక్షంగా జనసేనకు చురకేశారు.
తొలి నుంచి చాకచక్యంగా పార్టీని సినిమాటిక్ లెవల్లో ముందుకు తీసుకెళుతోన్న జనసేన ఇటీవల ఆడిన మైండ్ గేమ్ కు చెక్ పెట్టేలా చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక జాతీయ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో పొత్తులు అనేది సర్దుబాటుల మీద ఆధారపడి ఉందని అన్నారు. రాజ్యాధికారం దిశగా అంటూ దూకుడుగా ముందకెళుతోన్న జనసేనకు తాజాగా బాబు చేసిన కామెంట్ మింగుడపడడంలేదు. ఆ క్రమంలో మరో మైండ్ గేమ్ ను నాగబాబు రూపంలో జనసేన మొదలు పెట్టింది. పొత్తులున్నా లేకపోయినప్పటికీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటూ సన్నాయినొక్కులు నొక్కారు. మొన్నటి వరకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. జనసేనాని పవన్ కాబోయే సీఎం అంటూ నినదించిన నాగాబాబు మహానాడు తరువాత గొంతు సవరించుకున్నట్టు కనిపిస్తోంది.
సినిమా టిక్కెగ ఆన్ లైన్ విధానంపై పవన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కొణిదల, అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ వచ్చిందని టాలీవుడ్ టాక్. అందుకే, చిరంజీవి మధ్యేమార్గంగా ఉంటూ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. జనసేన పార్టీకి చిరు, చరణ్ అభిమానులు కొందరు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే, చిరంజీవి రాజకీయ మనోభావాన్ని వివరించే ప్రయత్నం నాగబాబు తాజాగా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావించిన నాగబాబు రాజకీయంగా జనసేనకు చిరంజీవి మద్ధతు ఉంటుందని వెల్లడించారు. అంటే, కేవలం కొణిదల, అల్లు కుటుంబాల మధ్యే కాదు, మెగా హీరోల అభిమానుల్లోనూ తికమక ఉందని తెలుసుకున్న నాగబాబు దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారని అర్థం అవుతోంది. రాబోవు ఎన్నికలకు మెగా హీరోలు అందరూ కలిసి వస్తారని జనసేనతో పొత్తును ఆశించిన పార్టీలతో సరికొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు.
ప్రస్తుతం జనసే, బీజేపీ పొత్తు ఉంది. ఆ విషయాన్ని జనసేనాని పవన్ పలు వేదికలపై చెప్పారు. కానీ, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విభిన్నంగా వెళుతున్నాయి. ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికలోనూ జనసేన, బీజేపీ కలిసి వెళ్లలేదు. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పైకి కనిపించినప్పటికీ పనితీరు విభిన్నంగా కనిపించింది. ఫలితంగా తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక జనసేన లేకుండా బద్వేల్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ డిపాజిట్లకు దగ్గరగా వచ్చింది. తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. కానీ, భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ మాత్రం బరిలోకి దిగుతోంది. అంటే, బీజేపీ, జనసేన మధ్య ఉన్న పొత్తు నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగా ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటే జనసేనకు 3శాతానికి మించి ఓటు బ్యాంకు కనిపించడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూపిస్తోన్న ఆ పార్టీ 27శాతం ఓటు బ్యాంకు ఉందంటూ పొత్తు కోసం చూస్తోన్న టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతోంది.
జనసేనలోని కొందరు ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనాని పవన్ ను ప్రకటించాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు. సరికొత్త మైండ్ గేమ్ ఆడుతోన్న జనసేన పార్టీకి మహానాడు హిట్ తరువాత చంద్రబాబు రివర్స్ గేమ్ మొదలుపెట్టినట్టు ఆయన మాటల ద్వారా స్పష్టం అవుతోంది. వెనుకబడిన వర్గాల ఓట్ల మీద ఆధారపడ్డ టీడీపీ ఒక వేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే నష్టమనే అంచనా వేస్తోంది. అంతేకాదు, కాపు రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్న జనసేన రూపంలో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. తాజా సర్వేల ప్రకారం టీడీపీ ఒంటరిగా వెళ్లినప్పటికీ గెలుపు ఖాయమనే ఫలితాలు వచ్చాయట. అందుకే, పొత్తులపై వన్ సైడ్ లవ్ , మేం ప్రతిపాదించాం..అటు వైపు నుంచి కదలిక ఉండాలనే వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు చేయడంలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తు అనే అంశం అంటూ దాటవేస్తున్నారు. సీట్ల సర్దుబాటు కూడా కష్టమనే సంకేతం ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద ఒంగోలు మహానాడు తరువాత టీడీపీ పొత్తులపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన మైండ్ గేమ్ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.