Power Cuts : పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
అసలే ఎండలు మండిపోతున్నాయి.. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు.. రాత్రి టైంలోనూ ఉక్కపోత పట్టి పీడిస్తోంది..
- By Pasha Published Date - 07:58 AM, Wed - 29 May 24

Power Cuts : అసలే ఎండలు మండిపోతున్నాయి.. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు.. రాత్రి టైంలోనూ ఉక్కపోత పట్టి పీడిస్తోంది.. ఈ పరిస్థితుల్లోనూ ఏపీలోని పట్టణాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా మంగళవారం రోజు ఏపీలోని కొన్ని ఫీడర్ల పరిధిలో 12 గంటలకుపైగా విద్యుత్ కోతలు అమలు చేశారు. ఈ టైంలో పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో పడిన బాధను మాటల్లో చెప్పుకోలేం. 33కేవీ, 11కేవీ ఫీడర్లు 253 బ్రేక్‌డౌన్ అయ్యాయని అందువల్లే విద్యుత్ కోతలు విధించామని అధికారులు తెలిపారు. కొన్ని గంటల్లోనే సమస్యను చక్కదిద్ది విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభించామని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
- దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోని 150కిపైగా ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
- సర్కిళ్ల వారీగా చూస్తే.. అనంతపురంలోని 25కుపైగా ఫీడర్లలో, తిరుపతిలోని 20కిపైగా ఫీడర్లలో, కర్నూలులోని 31 ఫీడర్లలో, కడపలోని 31 ఫీడర్లలో, నెల్లూరులోని 25 ఫీడర్లలో సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం రోజు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిందని సమాచారం.
- పలుచోట్ల దాదాపు 12 గంటలు కరెంటు రాలేదని ప్రజలు చెబుతున్నారు.
- తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో 32 ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచింది.
Also Read : Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం
ఏపీలో టెంపరేచర్స్ క్రమంగా పెరుగుతూపోతున్నాయి. జూన్ 3 నాటికి ఏపీలోని సముద్రతీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 11,558 మెగావాట్లుగా గత శుక్రవారం నమోదైంది. జూన్‌లో టెంపరేచర్స్ మరింత పెరిగితే గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 14 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో అన్ని వనరులనూ కలుపుకొని 20,610 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. దానిలో పునరుత్పాదక విద్యుత్ యూనిట్లు 50 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. జెన్‌కో థర్మల్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6,610 మెగావాట్లు ఉంది. అయితే వాటి ద్వారా గత సోమవారం రోజున సగటున 3,522 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే గ్రిడ్‌కు సప్లై అయింది. అంటే దాని సామర్థ్యంలో 53 శాతాన్ని మాత్రమే జెన్‌కో సాధించగలిగింది. వాస్తవానికి బొగ్గు కొరత కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి జరగడం లేదని అంటున్నారు.