AP New Cabinet: ‘కమ్మ’లేని మంత్రివర్గంలో కడప రెడ్డి
ప్రస్తుత రాజకీయాలను కుల, మత సమీకరణాల నుంచి వేరు చేసి చూడలేం. అందుకే సీఎం జగన్ ఆ కోణం నుంచి అడుగులు వేసినట్టు కనిపిస్తోంది.
- By CS Rao Published Date - 03:19 PM, Mon - 11 April 22

ప్రస్తుత రాజకీయాలను కుల, మత సమీకరణాల నుంచి వేరు చేసి చూడలేం. అందుకే, ఏపీ సీఎం జగన్ ఆ కోణం నుంచి అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు అవసరమైన సొంత బలాన్ని, ఉండే బలహీతలను కూడా తెలుసుకున్నారు. అందుకే, వెనుకబడిన వర్గాలకు(బీసీ 10) పది మంత్రి పదవులను ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇదో రికార్ట్. ఆ తరువాత ఎస్సీ లకు ఐదుగురికి అవకాశం కల్పించారు. సొంత సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ నాలుగు మంత్రి పదవులు ఇస్తూ కాపు సామాజిక వర్గానికి సమం చేశారు. ఇక ఎస్టీలకు ఒకటి మైనార్టీలకు ఒక మంత్రి ని ఇచ్చారు. కానీ, బలమైన కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులను పక్కకు నెట్టేశారు. సరిగ్గా ఇక్కడే జగన్ మార్క్ రాజకీయం ఉంది.తొలి మంత్రివర్గంలో వైశ్య, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వడం ద్వారా సామాజిక ఈక్వేషన్ కనిపించేలా జాగ్రత్త పడ్డారు. కానీ, ఈసారి రెండో క్యాబినెట్ లో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టారు. ఆ సామాజిక వర్గం ఐకాన్ గా చంద్రబాబును ఉన్నారు. ఆయనపై ఉన్న వ్యతిరేకత ఆ సామాజికవర్గంపై ప్రభావం చూపుతోంది. పైగా కమ్మ సామాజికవర్గంపై ఇతర వర్గాలు పెద్దగా అనుకూలంగా ఉండవనేది జగన్ లెక్క. అంతేకాదు, ఆ సామాజికవర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనే సంకేతం తీసుకెళ్లడం ద్వారా మిగిలిన వర్గాల నుంచి ఓట్లు రాబట్టాలని యోచనట. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సోషల్ మీడియా వేదికగా కమ్మ సామాజికవర్గాన్ని ఏకం చేసే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్లను కూడా కులం కార్డ్ తో అనివార్యంగా టీడీపీతో వచ్చేలా ఆ పార్టీ గేమ్ ఆడుతోంది. ఫలితంగా కమ్మ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి పడవని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకే, ఆ సామాజికవర్గానికి ఉండే ఒక్క మంత్రిని ఊడపీకారు.
గత క్యాబినెట్లో వైశ్య, క్షత్రియ సామాజికవర్గం నుంచి ఒకటి చొప్పున అవకాశం ఉండేది. ఈసారి వాళ్లకు కూడా ఏమీ ప్రాతినిధ్యం లేకుండా చేశారు. దానికీ ఓ లెక్క ఉందని విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో హిందూవాదంను నమ్ముకుని బీజేపీ దూసుకొస్తోంది. ఆ పార్టీ వైపు ఎక్కువగా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఉంటారని అంచనా. పైగా రెబల్ గా ఉన్న రఘురామక్రిష్ణంరాజు ఎపిసోడ్ జగన్ ను ఆలోచింప చేసిందని భావిస్తున్న వాళ్లు లేకపోలేదు. రాజులు అత్యధికులకు వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ ఒక అంచనాకు వచ్చిందని తెలుస్తోంది. తొలి నుంచి బ్రాహ్మణులకు క్యాబినెట్ లో స్థానం లేదు. ఈసారి కూడా వాళ్లకు ఇవ్వకపోవడానికి కారణం బీజేపీ ప్రభావం ఉందని వినికిడి. బ్రాహ్మణులు, వైశ్యలు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లు. ఓటింగ్ కు వచ్చే వాళ్ల సంఖ్య కూడా సహజంగా తక్కువగా ఉంటుంది. ఒక వేళ ఓటింగ్ కు వచ్చినప్పటికీ బీజేపీ వైపు మొగ్గుచూపుతారని ఒక అంచనా. అందుకే, ఇతర సామాజికవర్గాలపై జగన్ ఈక్వేషన్ రచించారట.
వెనుకబడిన వర్గాలు తొలి నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉండేది. అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ ఇచ్చిన 10శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు ప్రకటించిన తరువాత వైసీపీ వైపు మళ్లారు. తిరిగి టీడీపీ వైపు రాకుండా చేసేందుకు ఇప్పటికే సుమారు 52 కార్పొరేషన్లను జగన్ ఏర్పాటు చేశారు. పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. గత క్యాబినెట్ లో ఏడుగురు బీసీలకు ఇచ్చిన జగన్ ఈసారి ఏకంగా 10 మందికి ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంకును గంపగుత్తగా పొందాలని ప్లాన్ చేస్తున్నారట. రెడ్డి సామాజిక వర్గం ఎలాగూ జగన్ కు మద్ధతుగా ఉంటుంది. ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ వైపు మళ్లారనేది 2019 ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది. పైగా సంక్షేమ పథకాలు ఆ వర్గాలకు అందుతున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే శెట్టి బలిజ, కాపు సామాజికవర్గంపై ఎక్కువగా జగన్ దృష్టి పెట్టారు. సొంత సామాజికవర్గం రెడ్లకు ఇచ్చిన విధంగా నాలుగు మంత్రి పదవులను కాపులకు ఇచ్చారు.
కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా జనసేనకు వెళతాయి. ఆ విషయం 2019 ఎన్నికల్లో కనిపించిందని జగన్ లెక్క. ఆ కోణం నుంచి ఆలోచించిన ఆయన ఈసారి ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు పూర్తిగా మళ్లించే ప్రయత్నంలో బొత్సా, అంబటి, తాడిశెట్టి రాజా లాంటి వాళ్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మైనార్టీలు తొలి నుంచి వైసీపీకి అండ ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఆ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ ఎస్టీలకు లేని స్థానాన్ని జగన్ మంత్రివర్గంలో కల్పించారు. ఇవన్నీ గమనిస్తే, రాబోవు ఎన్నికల్లో ఓట్లు వేసే సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారని స్పష్టం అవుతోంది. రెబల్ రఘురామక్రిష్ణంరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాల ఓట్లు ఈసారి పడవని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కుల, మత ప్రాతిపదికన జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే, మతం ప్రాతిపదికన క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులకు హ్యాండిచ్చారని తెలుస్తోంది. ఇక కులం ప్రాతిపదికన కమ్మ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వలేదని సర్వత్రా వినిపిస్తోన్న మాట. ఐదు దశాబ్దాల ఏపీ చరిత్రలో కమ్మ సామాజికవర్గం లేకుండా ఏర్పడిన క్యాబినెట్ ఇదే. సరిగ్గా ఈ అంశం హైలెట్ కావాలని జగన్ కోరుకుంటున్నారని తెలిసింది. ఫలితంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఓటు బ్యాంకు పదిలంగా వైసీపీకి ఉంటుందని ఆయన ఈక్వేషన్ గా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల్లో ఈసారి కుల, మత ఈక్వేషన్ పనిచేస్తుందా? అనేది చూడాలి.