Jagan : వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్లారిటీ
Jagan : ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమయ్యే విషయమికాదని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 06:29 PM, Mon - 10 February 25

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Andhra Pradesh Assembly Budget Meetings) ఫిబ్రవరి 24 నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Jagan) హాజరవుతారా, లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తుండగా, వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా లభిస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం దక్కుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రతిపక్ష హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమయ్యే విషయమికాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అని ఆయన తెలిపారు. చట్టాలు, నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అన్నారు.
Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ ఆయనే ? బీసీ నేతకు బిగ్ ఛాన్స్ ?
అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలనే సూచించారు. అసెంబ్లీకి రాకుండా బయట నుండి విమర్శలు చేయడం సరికాదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు ఇచ్చినంత సమయాన్ని తనకు ఇవ్వాలని జగన్ కోరడం న్యాయసమ్మతమా? అని ప్రశ్నించారు. ఏ నియమం ప్రకారం అదనపు సమయం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారో చెప్పాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ పేర్కొన్నారు. సభకు హాజరుకాలేకపోతే, తగిన కారణాలను తెలియజేస్తూ స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించారు. సరైన కారణం ఉంటేనే అనుమతి ఇవ్వబడుతుందని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరి జగన్ ఏంచేస్తారో చూడాలి.