Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం
ముండ్లమూరు మండలం పరిధిలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులలో స్వల్ప భూప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి.
- By Pasha Published Date - 11:23 AM, Sat - 21 December 24

Earthquake: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. ముండ్లమూరు మండలం పరిధిలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులలో స్వల్ప భూప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి. భూప్రకంపనలను ఫీల్ అయిన వెంటనే ముండ్లమూరులోని ఒక పాఠశాల నుంచి స్టూడెంట్స్ బయటకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గవర్నమెంటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు రోడ్లపైకి వెళ్లి కూర్చున్నారు. ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయని తెలిసింది. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం సహా పలు గ్రామాలలో దాదాపు 3 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఈనెల 4వ తేదీన కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని చాలా జిల్లాల్లో భూమి కంపించింది. అప్పట్లో భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో ఉన్నట్లు గుర్తించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భూమి కంపించింది. ఆ వెంటనే డిసెంబరు 7న మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో భూకంపం సంభవించింది. జూరాల ప్రాజెక్టుకు సమీపంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Also Read :Obamas Favourite Film : 2024లో ఒబామా మనసు గెల్చుకున్న ఇండియన్ మూవీ ఇదే
నేపాల్‌లో..
ఇవాళ తెల్లవారుజామున నేపాల్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈవిషయాన్ని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. మన దేశ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:59 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అక్షాంశం 29.17 N, రేఖాంశం 81.59 E వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపారు.
వణికిపోయిన వనౌటు
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉండేే ద్వీప దేశం వనౌటు గత మంగళవారం రోజు భూకంపంతో వణికిపోయింది. దీంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘోర విపత్తుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వనౌటులో దాదాపు 3 సెకన్ల పాటే భూమి కంపించిందని తెలిసింది. ఈ దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమం దిక్కున 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు., రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది.