Mudragada Padmanabham: ముద్రగడ కుమారులు చెప్పిన షాకింగ్ నిజాలు.. క్రాంతి విషయంలో కూడా తమ తండ్రి ముందుగానే స్పష్టత ఇచ్చారు
- Author : Vamsi Chowdary Korata
Date : 17-07-2026 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు ఒక లేఖను విడుదల చేశారు. తండ్రి మరణం అనంతరం జరిగిన పరిణామాలపై ఆ లేఖలో స్పందించారు. ఆయన ముద్రగడ వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి నిలువుటద్దమన్నారు. తమ తండ్రి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించామని, మరణం తర్వాత ఏం చేయాలో ఆయన తమకు స్పష్టంగా చెప్పారన్నారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఈ విషాద సమయంలో తమకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. క్రాంతి తన కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదేనన్నారు.
ముద్రగడ పద్మనాభం తమను విడిచి వెళ్లిపోయిన సమయంలో తీవ్ర దుఃఖంలో ఉన్న తమ కుటుంబాన్ని ఓదార్చిన నాయకులకు, ముద్రగడ అభిమానులకు, వివిధ హోదాలలో ఉన్న పెద్దలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన లేని లోటు జన్మ జన్మలకు తీరదని, ఈ కష్టకాలంలో స్వయంగా వచ్చి ఓదార్చినవారు, నివాళులు అర్చించిన వారు, రాలేకపోయినా ఆయన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి నిలువుటద్దంగా ఉన్నారన్నారు. రాజకీయాలు, పదవులు కన్నా ఆయన తన వ్యక్తిత్వానికే పెద్దపీట వేసుకుంటూ వచ్చారని, ప్రాణాలు పోయినా మాట తప్పకూడదని, పరువు ప్రతిష్టలు కోల్పోకూడదన్న పద్ధతిలోనే ఆయన జీవితం మొత్తం కొనసాగించారన్నారు.
‘తన మరణాంతరం ఏం చేయాలనే కార్యక్రమాలపై మా కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు తన నిర్ణయాలను చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు కానీ, సాయం కానీ వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. అందుకే మేము ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి, ముద్రగడ గారి మీదున్న అపార గౌరవాన్ని చాటారు. మా కుటుంబం మీద ఆయన వాత్సల్యం చూపించారు, వారికి ప్రత్యక్షంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం’ అన్నారు.
మా కుటుంబం ఈ విషాదంలో ఉండగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వం, పట్టుదల, ఆయన అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా లోకానికి చెప్పనక్కర్లేదు. తన అంతిమ సంస్కారాలు ఏవిధంగా జరగాలో ఆయనే మాకు నిర్దేశించారు. ఆయన మాకు చెప్పిన మాటలు శిరోధార్యం, ఆ ప్రకారమే మేము చేశాము. వీటిలో ఎలాంటి రాజకీయాలు, ఎవరి ప్రలోభాలు లేవు. ఒక ఉద్యమ నేతగా అణిచివేతలు, అవమానాలు ఎదుర్కొన్న ఆయనకు అధికారిక లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదని లేఖలో ప్రస్తావించారు.
బార్లపూడి క్రాంతి గారి కుటుంబానికి మాకు మధ్య గత కొన్నేళ్లుగా రాకపోకలు లేవని, ఎలాంటి సంబంధాలు లేవని, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందో ముద్రగడ గారే స్వయంగా మీడియా ముఖాముఖిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె రాకూడదన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ముద్రగడ గారి అంతిమ నిర్ణయమే. దయచేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే విధంగా వార్తలు, అభిప్రాయాలు ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మీడియా పెద్దలకు చేతులు జోడించి వేడుకుంటున్నాము అన్నారు.