AP & TG Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఎండ తీవ్రత
AP & TG Temperatures : తెలంగాణలో ఈరోజు అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది
- By Sudheer Published Date - 08:50 PM, Sat - 15 March 25

తెలుగు రాష్ట్రాల్లో ఎండా తీవ్రత (Temperatures ) రోజురోజుకూ మరింత పెరుగుతోంది. భానుడు మండిపడుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో ఈరోజు అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీల స్థాయికి చేరుకున్నాయి. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతోంది. నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Sundar Pichai: క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.. కానీ ఇప్పుడు రోజుకు రూ. 6.67 కోట్లు సంపాదన!
వడగాలులతో కూడిన భయంకరమైన ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటిని ఎక్కువగా తాగడం, శరీరానికి తగినంత ద్రవాలు అందించుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ ముప్పు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా 5 రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. వడగాలుల ప్రభావం అధికంగా ఉండే సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచనలు జారీ చేశారు. రైతులు, ఉపాధి కార్మికులు కూడా ఎండ వేడి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.