Badvel : ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Badvel : నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేసాడని పోలీసులు స్పష్టం చేసారు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉందని , ప్రేమించుకుని విడిపోయారు
- By Sudheer Published Date - 06:35 PM, Sun - 20 October 24

బద్వేల్ (Badvel ) ఘటన నిందితుడు విఘ్నేశ్ (Vignesh) ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ‘నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేసాడని పోలీసులు స్పష్టం చేసారు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉందని , ప్రేమించుకుని విడిపోయారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో అమ్మాయి అతడిని కలవడానికి వెళ్లింది. ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. తర్వాత వాగ్వాదం జరగగా, విఘ్నేశ్ ఆమెకు నిప్పంటించాడు’ అని కడప SP తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితుడి ఆచూకీ కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కొద్దీ సేపటి క్రితం మీడియా ముందుకు తీసుకొచ్చారు.
ఇక ఈ ఘటన పట్ల హోంమంత్రి అనిత స్పందించారు. ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.
Read Also : Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ మెకానిక్..