Ayyanna Patrudu: పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు!
Ayyanna Patrudu : విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరూ ఊహించని స్టేట్మెంట్ ప్రకటించారు
- By Gopichand Published Date - 08:15 PM, Sat - 2 November 24

తెలుగుదేశం పార్టీ (TDP) పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటూ 40 ఏళ్లకు పైగా రాజకీయాన్ని పూర్తి చేసుకున్న విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఎవరూ ఊహించని స్టేట్మెంట్ ప్రకటించారు. తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన ప్రకటించేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రస్తుతం స్పీకర్‌గా కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు.
జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశానన్న ఆయన వయసు మీద పడుతోందని గుర్తు చేశారు. అలాగే పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన మంచి మాత్రమే జీవితాంతం గుర్తుంటుందని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అయితే అయ్యన్నపాత్రుడు స్థానంలో ఆయన పెద్ద కుమారుడి విజయ్‌ని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపుతారని తెలుస్తోంది. విజయ్‌ను అయ్యన్న రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటున్నారు. అయితే 2029 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు కుమారుడే నర్సీపట్నంనియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి ఉంటారని కార్యకర్తలు సైతం ఆశిస్తున్నారు.ఇకపోతే అయ్యన్నపాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 శాసనసభ ఎన్నికలలో 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరుపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.
Read Also : Kerala : రైలు ఢీకొని నలుగురు రైల్వే కూలీల దుర్మరణం
1994-96 లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున అనకాపల్లి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో వచ్చిన తరువాత అయ్యన్న అటవీశాఖ మంత్రి పదవిలో కొనసాగారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగా ఉన్నారు.
2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అతను 1989, 2009, 2019లో అదే శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. అతను 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ విభజించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ స్పీకరుగా 2024 జూన్ 22న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.