Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుఉతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినట్టు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
- By Latha Suma Published Date - 10:36 PM, Sun - 1 September 24

Prakasam Barrage : గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షాలు బెజవాడలో కురిసినట్టు చెబుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ విజయవాడలో రహదా రులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జన జీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుఉతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినట్టు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం ఐదు లక్షలు క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి ఏడు గంటలు సమయానికి తొమ్మిది లక్షలు క్యూసెక్కులు దాటిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇంత భారీ స్థాయిలో వరద నీరు రావడం కొన్ని దశాబ్ధాల తరువాత ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి 9.30 లక్షల క్యూసెక్కులు వరకు నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 9.18 లక్షల క్యూసెక్కులు, కాలువలు ద్వారా 500 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో కాలువలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది దిగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న వాగులు నుంచి కృష్ణా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది.
వరద తీవ్రత గంట గంటకు పెరుగుతుండడంతో లంక గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద తీవ్రత పెరుగుతుండంతో కృష్ణా నది లంక గ్రామాలు పరిధిలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలు ఇప్పటికే పూర్తిగా నీటమునిగిపోయాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే ఆయా గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. పులిగడ్డ, దక్షిణ చిరువొల్లంక, కె కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక తదితర గ్రామాల బాధితులను పునవారాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వీరికి అవసరమైన ఆహారం, మంచి నీటిని అందిస్తున్నారు. వైద్య శిబిరాలను అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read Also: Amit Shah : సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..